ఏపీ బిజెపి అధ్య‌క్షుడు సోము వీర్రాజుకు ప‌ద‌వీ గండం ?

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఇటీవ‌ల విశాఖ‌ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చి వెళ్ళిన త‌ర్వాత ఏపీ బిజెపి అధ్య‌క్షుడు సోము వీర్రాజు పదవి ఊడనుందనే వార్త‌లు మ‌ళ్ళీ తెర‌పైకి వ‌చ్చాయి.వీర్రాజును పదవి నుంచి తప్పించేందుకు కుట్ర జరుగుతోందని, ప్రధాని విశాఖపట్నం వచ్చినప్పుడు కొందరు నాయకులు వీర్రాజును పక్కనపెట్టి షో మొత్తాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించారని వీర్రాజుకు సన్నిహితులు అంటున్నారు.

Advertisement
Update:2022-11-15 19:01 IST

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ‌ అధ్య‌క్షుడు సోము వీర్రాజుకు ప‌ద‌వీ గండం పొంచి ఉంద‌ని తెలుస్తోంది. పార్టీ వ‌ర్గాల నుంచి ఒక సెక్ష‌న్ మీడియాకు లీకులు వస్తుండ‌డంతో ఈ అనుమానాలు బ‌ల‌ప‌డుతున్నాయి. ముఖ్యంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఇటీవ‌ల విశాఖ‌ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చి వెళ్ళిన త‌ర్వాత ఈ వార్త‌లు మ‌ళ్ళీ తెర‌పైకి వ‌చ్చాయి.

మోడీ బిజిపి స‌భ్యుల‌తో జ‌రిగిన స‌మావేశంలో చోటు చేసుకున్నాయ‌ని చెబుతున్న ప‌రిణామాలు ఈ వ‌దంతుల‌కు బ‌లాన్ని చేకూరుస్తున్నాయి. ఈ స‌మావేశంలో పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడినే పేరేంటి అని పార్టీకి చెందిన ప్ర‌ధాని అడిగాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. అలాగే జిల్లాల‌కు సంబంధించిన స‌మాచారంతోపాటు రాష్ట్ర రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను వివ‌రించ‌లేక‌పోయార‌ని, వాటిని చ‌క్క‌దిద్ద‌లేక‌పోయార‌ని ప్ర‌ధాని అసంతృప్తిగా ఉన్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. వీటిని పార్టీలోని వారే కొంద‌రు ప్ర‌చారం చేస్తున్నార‌ని పార్టీ వ‌ర్గాల్లో వినిపిస్తున్న‌ది.

ముఖ్యంగా జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ తో త‌గినంత స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రించ‌క పోవ‌డం, ఇరు పార్టీల మ‌ధ్య‌ సంబంధాల‌ను పెంపొందించ‌లేక‌పోవ‌డం ప‌ట్ల ప్ర‌ధాని మోడీ రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ట్ల అసంతృప్తితో ఉన్నారంటున్నారు. అయితే వాస్త‌వాలు ఎలా ఉన్నా, ఈ వార్త‌ల‌ను బిజెపి కోర్ క‌మిటీలోని కొంద‌రు వ్య‌క్తులు పార్టీ జాతీయ నాయ‌క‌త్వం ఎదుట వీర్రాజుకు వ్య‌తిరేకంగా నూరిపోసేందుకు ఈ వినియోగించుకుంటున్న‌ట్టు ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి.

వీర్రాజును పదవి నుంచి తప్పించేందుకు కుట్ర జరుగుతోందని, అందుకే ప్రధాని విశాఖపట్నం వచ్చినప్పుడు రాష్ట్ర బీజేపీ చీఫ్‌కి ఎలాంటి క్రెడిట్‌ ఇవ్వలేదని ఈ నాయకులు షో మొత్తాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించారని వీర్రాజుకు సన్నిహితులు తెలిపారు. అయితే, బిజెపి కోర్ కమిటీ నాయకులతో ఇంటరాక్షన్ సందర్భంగా, వీర్రాజుపై నేరుగా ఎటువంటి ప్రస్తావన చేయనప్పటికీ, మొత్తం రాష్ట్ర పార్టీ నేతల అలసత్వ వైఖరిపై మోడీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

దీంతో ఏపీ బీజేపీ శాఖ‌ను ప్ర‌క్షాళ‌న చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డాకు ప్ర‌దాని సూచించార‌ని అంటున్నారు. ఈ వార్త‌లు నిజ‌మైతే మాత్రం వీర్రాజుకు ప‌ద‌వీ గండం త‌ప్ప‌క‌పోవ‌చ్చ‌ని తెలుస్తోంది. మ‌రి కొన్ని రోజుల్లో ఈ విష‌యంలో స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Tags:    
Advertisement

Similar News