రామోజీ ఎందుకు మాట్లాడటం లేదు?

నిజంగానే మార్గదర్శిలో ఎలాంటి ఉల్లంఘనలు జరగకపోతే మీడియా సమావేశం పెట్టి ప్రభుత్వ, సీఐడీ వేధింపులను వివరించవచ్చు కదా. తనకు మద్దతుగా ఎవరెవరినో తెర మీదకు తీసుకురావాల్సిన అవసరం ఏమిటి?

Advertisement
Update: 2023-04-14 05:23 GMT

మార్గదర్శి చిట్ ఫండ్స్ యాజమాన్యం చైర్మన్ రామోజీరావు వ్యవహారం చాలా విచిత్రంగా ఉంటోంది. మార్గదర్శిలో అక్రమాలు జరిగాయని, చట్టాల ఉల్లంఘన జరిగిందనేది సీఐడీ విచారణలో బయటపడింది. ప్రాథ‌మిక సూత్రమైన చిట్ ఫండ్ డిపాజిట్లను చిట్టేతర వ్యాపారాలకు మళ్ళించినట్లు రామోజీయే అంగీకరించారని సీఐడీ చెబుతోంది. అలాగే చిట్ ఫండ్ చట్టాన్ని మార్గదర్శి యాజమాన్యం ఉల్లంఘించినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయని అంటున్నారు. మార్గదర్శి ముసుగులో హవాలా, మనీల్యాండరింగ్ కూడా జరిగిందని సీఐడీ అడిషినల్ డీజీ సంజయ్ ఢిల్లీలో చెప్పారు.

మీడియా సమావేశంపెట్టి మార్గదర్శి ముసుగులో రామోజీ చేసిన ఉల్లంఘనలను చెప్పారంటే అందుకు తగ్గ ఆధారాలు కచ్చితంగా ఉంటాయనే అనుకుంటున్నారు. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే సీఐడీ విచారణను, ప్రభుత్వాన్ని తప్పుపడుతూ వివిధ రంగాలవాళ్ళని ప్రతిరోజు రామోజీ రంగంలోకి దింపుతున్నారు. ఆడిటర్లు, లాయర్లు, మీడియా సంఘాలు, చిట్ ఫండ్ ఆలిండియా అసోసియేషన్, ఎక్స్ ఆర్మీ ఇలా ఎవరు దొరికితే వాళ్ళతో మార్గదర్శికి మద్దతుగా మాట్లాడిస్తున్నారు.

అంతా బాగానే ఉందికానీ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడించే బదులు రామోజీయే ఎందుకు రంగంలోకి దిగలేదు? మార్గదర్శిలో ఎలాంటి అక్రమాలు చేయలేదని, చట్ట ఉల్లంఘనలు జరగలేదని మీడియా సమావేశం పెట్టి చెప్పవచ్చు కదా. తనతో పాటు కోడలు, ఎండీ అయిన శైలజను సీఐడీ విచారించిన విషయాన్ని వివరించవచ్చు కదా. గతంలో జగన్మోహన్ రెడ్డిని సీబీఐ, ఈడీలు విచారించినపుడు, తాజాగా వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ చేస్తున్న విచారణను లైవ్ రిపోర్టింగ్ లాగ రిపోర్టు చేస్తున్నారు కదా. విచారణలో ఏమి జరిగిందనే విషయాన్ని దగ్గరుండి చూసినట్లు రిపోర్టు చేస్తున్న విషయం తెలిసిందే.

ఎవరినో ఎవరో విచారణ చేస్తుంటే తమ సమక్షంలోనే విచారణ జరిగినట్లుగా వార్తలు ప్రచురిస్తున్న రామోజీ మరి తన విచారణలో ఏమి జరిగిందనే విషయాన్ని మాత్రం ఎందుకని ఇంతవరకు ప్రచురించలేదు. నిజంగానే మార్గదర్శిలో ఎలాంటి ఉల్లంఘనలు జరగకపోతే మీడియా సమావేశం పెట్టి ప్రభుత్వ, సీఐడీ వేధింపులను వివరించవచ్చు కదా. తనకు మద్దతుగా ఎవరెవరినో తెర మీదకు తీసుకురావాల్సిన అవసరం ఏమిటి? ప్రతిరోజూ ఇంతమందితో మద్దతుగా మాట్లాడిస్తున్నారంటేనే మార్గదర్శిలో అవకతవకలు జరిగాయని, అందులో నుంచి బయటపడేందుకే దర్యాప్తు సంస్థ‌ల‌ను రామోజీ ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తున్నారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

Tags:    
Advertisement

Similar News