చంద్రబాబు సభల్లో జనం మరణాలకు కారణమెవరు ?

చంద్రబాబు నిర్వహిస్తున్న రోడ్ షోలు , సభలకు పెద్ద ఎత్తున జనాలను సమీకరిస్తున్నారు. జనాలు ఎక్కువగా కనిపించేందుకు రోడ్ షో ,సభలన్నీ వీధి మూలలు, ఇరుకైన సందులలో నిర్వహిస్తున్నారు. ఆ చిన్న‌ స్థలంలో వచ్చిన జనాలు పట్టకపోవడం కూడా ఈ సమస్యకు కారణం.

Advertisement
Update:2023-01-02 16:46 IST

తెలుగు దేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సభల్లో తొక్కిసలాటలకు, జనం మరణాలకు కారణమెవరు ? ఎన్నడూ ఎవరి సభల్లోనూ జరగని ఈ సంఘటనలు ఆయన సభల్లోనే ఎందుకు జరుగుతున్నాయి ? ఇంత కన్నా ఎక్కువ మంది హాజరైన వైఎస్ జగన్ సభల్లో గానీ, తెలంగాణలో కేసీఆర్ సభల్లో కానీ ఏనాడూ జరగని ఇలాంటి తొక్కిసలాటలు బాబు సభల్లోనే ఎందుకు జరుగుతున్నాయి ?

నాలుగు రోజుల వ్యవ‌ధిలో చంద్రబాబు పాల్గొన్న రెండు సభల్లో 11 మంది మరణించారు. రెండు సభల్లోనూ తొక్కిసలాటవల్లే ఈ మరణాలు సంభవించాయి.

నెల్లూరు జిల్లా కందుకూరులో డిశంబర్ 28 న తెలుగుదేశం పార్టీ అద్వర్యంలో జరిగిన 'ఇదేంకర్మ' సభలో చంద్రబాబు మాట్లాడుతుండగానే తొక్కిసలాట జరిగి పక్కనే అతి పెద్ద మురికి కాలువలో పడి 8 మంది మరణించారు.

ఇక జనవరి 1వ తేదీన గుంటూరులో తెలుగు దేశం అభిమాని, టీడీపీ టికట్ ఆశిస్తున్న ప్రవాసాంధ్రుడు ఉయ్యూర్ శ్రీనివాస్ నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగం చేసి వెళ్ళిపోగానే జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మరణించారు.

ఈ రెండు చోట్ల ఈ ఘటనలు జరగడానికి కారణమేంటి ? టీడీపీ ఆరోపిస్తున్నట్టు పోలీసులు కారణమా ? వైసీపీ ఆరోపిస్తున్నట్టు చంద్రబాబు ప్రచార పిచ్చి కారణమా ? జనం ఆరోపిస్తున్నట్టు నిర్వాహకుల నిర్లక్ష్యం కారణమా ? లేక ఇంకా ఏమైనా కారణాలున్నాయా ?

ఏపీలో ఎన్నికలకు కొద్ది రోజులే సమయముంది. పార్టీని బలోపేతం చేయడానికి ప్రజల్లో జగన్ సర్కార్ పై వ్యతిరేకత తేవడానికి చంద్రబాబు తీవ్రంగానే కష్టపడుతున్నారు. అందులో భాగంగానే ఇదేం కర్మ సభలు నిర్వహిస్తున్నారు. ఈ నెలలో ఆయన కుమారుడు నారా లోకేష్ పాదయాత్ర కూడా ప్రారంభం కానుంది.

ఇక చంద్రబాబు నిర్వహిస్తున్న రోడ్ షోలు , సభలకు పెద్ద ఎత్తున జనాలను సమీకరిస్తున్నారు. జనాలు ఎక్కువగా కనిపించేందుకు రోడ్ షో, సభలన్నీ వీధి మూలలు, ఇరుకైన సందులలో నిర్వహిస్తున్నారు. ఆ చిన్న‌ స్థలంలో వచ్చిన జనాలు పట్టకపోవడం కూడా ఈ సమస్యకు కారణం. కందుకూరులో సభా స్థలం చాలా చిన్నగా ఉంది. పక్కనే పెద్ద మురికి కాలువ ఉన్నది. జనం కొద్దిగా ఎక్కువ వచ్చినా ఆ కాలువలో పడిపోతారన్న జ్ఞానం నిర్వాహకులకు లేక పోవడం ఆశ్చర్యమే. ఇక్కడ అదే జరిగింది చంద్రబాబు ప్రసంగం మొదలు పెట్టగానే ప్రజలు ముందుకు తోసుకవచ్చారు. దాంతో కాలువ మీద నిలబడ్డవారు ఆ కాలువలో పడిపోయారు. అక్కడికక్కడే ఐదురు మరణించగా మరో ముగ్గురు ఆస్పత్రిలో మరణించారు.

ఇక్కడ నిర్వహకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతోంది. దాంతో పాటు పోలీసుల వైఖరి కూడా అనేక ప్రశ్నలకు తావిస్తోంది. సభాస్థలం చిన్నగా ఉందని, పక్కనే అతి పెద్ద మురికి కాలువ ఉందని తెలిసీ పోలీసులు అనుమతి ఎలా ఇచ్చారన్నది ముఖ్యమైన ప్రశ్న. అయితే తాము అనుమతి ఇచ్చిన స్థలంలో కాకుండా నిర్వాహకులు మరో ప్రదేశంలో సభ పెట్టారని పోలీసు అధికారులు చెప్తున్నారు.

ఇక రెండవ సంఘటన‌ జరిగిన గుంటూరూలో కూడా నిర్వాహకుల నిర్లక్ష్యం, పోలీసుల తీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

గుంటూరులో చంద్రన్న కానుక పేరుతో పేద మహిళలకు బహుమతులు, వస్త్రాలు పంచి పెడతామని ఉయ్యూరు శ్రీనివాస్ తో పాటు, టీడీపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఓ చిన్న ప్రైవేటు స్థలంలో సభ నిర్వహించారు. ఆ స్థలంలో పది వేల మంది పట్టడం కూడా కష్టమే అని ప్రజలు చెప్తున్నారు. అయితే బహుమ‌తులపై ఆశతో ఆసభకు 30 వేల మందికి పైగా ప్రజలు వచ్చారు. అందులో ఎక్కువ మంది మహిళలే. అయితే 30 వేల మందికి ఇవ్వగలిగినన్ని బహుమతులు నిర్వాహకుల వద్ద లేవు. 30 వేల మంది వస్తారని వారు ఊహించలేదట‌.

చంద్రబాబు సభలో ప్రసంగించి వెళ్ళిపోగానే బహుమతులకోసం జనం తోసుక వచ్చారు. అక్కడ గందరగోళం వ్యాపించింది. తోపులాట జరిగింది. ఆ తోపులాటలో ఓ మహిళ అక్కడే మరణించగా ఆస్పత్రిలో మరో ఇద్దరు మహిళలు మరణించారు.

ఈ సభ నిర్వాహకులు పది రోజులకు పైగా ఈ సభ గురించి, కానుకల గురించి వేలాది మంది ప్రజల వద్ద ప్రచారం చేసి తీరా 30 వేల మంది వచ్చే సరికి అంత మంది వస్తారని తమకు తెలియదని అమాయకత్వం నటించడం క్షమించరానిది. ఈ మరణాలకు కూడా ఖచ్చితంగా నిర్వాహకుల వైఫల్యమే కారణం. దాంతో పాటు పోలీసుల పాత్ర కూడా ప్రశ్నించవలసినదే. అటు కందుకూరులో కానీ, ఇటు గుంటురూలో కానీ పోలీసుల భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ రెండు సంఘటనలపై పక్షపాత రహితంగా విచారణ జరిపితే అసలు నిజాలు బైటికొచ్చే అవకాశం ఉంది.

అయితే ఈ సంఘటనలు టీడీపీని మాత్రం ఇరుకున పెట్టేవే. ఇప్పటికే ఆ పార్టీపై ఇతర రాజకీయ పక్షాల నుంచి , ప్రజల నుంచి కూడా తీవ్ర విమర్షలు వస్తున్నాయి. ఇలాంటి సంఘటన ఏ ఒక్కటి మళ్ళీ జరిగినా టీడీపీకి కోలుకోలేని దెబ్బే అవుతుంది. ఇప్పటికైనా ఆపార్టీ, ప్రజలు ఎక్కువమంది వచ్చారని చూపించుకోవడానికి ఇరుకు ప్రదేశాల్లో సభలు నిర్వహించడం మానుకోకపోతే తీవ్రనష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇదే అవకాశంగా తీసుకొని వైసీపీ ప్రభుత్వం కూడా చంద్రబాబు సభలకు అనుమతులు నిరాకరించవచ్చనే వాదనలు కూడా వినవస్తున్నాయి.

జనవరి 27 నుంచి తెలుగు దేశం పార్టీ భారీ గా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్న నారా లోకేష్ పాద యాత్రకు కూడా పోలీసులు ఈ రెండు సంఘటనలు కారణంగా చూపి అనుమతి నిరాకరిస్తారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News