అమరావతిపై శ్వేతపత్రం.. జగన్ పై రెండో విమర్శనాస్త్రం

అమరావతి నిర్మాణంలో కొత్త ప్రణాళికలేవీ లేవని, పాత వాటినే కొనసాగిస్తూ నిర్మాణం చేస్తామని స్పష్టం చేశారు చంద్రబాబు.

Advertisement
Update: 2024-07-03 14:38 GMT

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తూ, జగన్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇటీవల పోలవరంపై తొలి శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు, తాజాగా రాజధాని అమరావతిపై రెండో పత్రం ప్రజల ముందుకు తెచ్చారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై ఆయన మరోసారి ఘాటు విమర్శలు చేశారు.


అమరావతిని విధ్వంసం చేసి తెలుగు జాతికి ద్రోహం చేశారంటూ జగన్ పై మండిపడ్డారు చంద్రబాబు. రాజధానిని మార్చిన వ్యక్తి గతంలో ఎవరూ లేరని, ఆ పని చేస్తే.. ఫలితం ఎలా ఉంటుందని చెప్పడానికి ఏపీ ఒక కేస్ స్టడీ అన్నారు. ఇంతగా విధ్వంసం చేసిన వ్యక్తి రాజకీయాలకు అర్హుడేనా? అని ప్రశ్నించారు బాబు. గత ప్రభుత్వంలో అక్రమ కేసులు ఎదుర్కొన్న అమరావతి రైతులకు తామిప్పుడు న్యాయం చేస్తామన్నారు. అమరావతి నిర్మాణానికి సంబంధించి న్యాయపరమైన చిక్కులు తొలగించి పనులు శరవేగంగా పూర్తి చేస్తామన్నారు. ఈ శిథిలాల నుంచే బంగారు భవిష్యత్తుకు నాంది పలుకుతామన్నారు చంద్రబాబు.

గతంలో పోలవరం విషయంలో కూడా శ్వేతపత్రంలో ఎలాంటి డెడ్ లైన్ పెట్టలేదు, ఇప్పుడు అమరావతి నిర్మాణంపై కూడా ఎక్కడా డెడ్ లైన్ ప్రకటించలేదు సీఎం చంద్రబాబు. అమరావతిలో పనులు మళ్లీ ప్రారంభమయ్యాయని, అంచెలంచెలుగా నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారాయన. ప్రపంచంలోనే అతిపెద్ద భూ సేకరణ ప్రాజెక్టు అమరావతి అని అన్నారు. ఇది ఏ ఒక్కరి రాజధాని కాదని, యావత్‌ రాష్ట్ర ప్రజలదని తెలిపారు. ప్రతి తెలుగు బిడ్డ అమరావతి నాది అని గర్వంగా గుర్తించాలని చెప్పారు చంద్రబాబు. కొత్తగా ప్రణాళికలు ఏమీ లేవని, పాత వాటినే కొనసాగిస్తూ నిర్మాణం చేస్తామని స్పష్టం చేశారు. 

Tags:    
Advertisement

Similar News