జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ కి చంద్రబాబు రిప్లై ఏమిచ్చారంటే?
తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ కి చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ఏపీలో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈనెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ గెలుపుపై టాలీవుడ్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ.. చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ కి చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'థాంక్యూ వెరీ మచ్ అమ్మ' అని రిప్లై ఇచ్చారు.
కొన్నేళ్ల కిందట టీడీపీ విజయం కోసం పనిచేసిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత చంద్రబాబుకు దూరం అయ్యారన్న ప్రచారం జరిగింది. నారా, నందమూరి ఫ్యామిలీలు జూనియర్ ఎన్టీఆర్ ను దూరంపెట్టాయన్న వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ కూడా వాళ్లకు దూరంగానే ఉంటున్నట్లు తెలుస్తోంది. కొంతకాలం కిందట చంద్రబాబు అసెంబ్లీలో తన భార్య భువనేశ్వరిని ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యేలు అసభ్యకర మాటలు మాట్లాడరని ఆరోపిస్తూ భావోద్వేగానికి లోనైన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో దీనిని నందమూరి, నారా కుటుంబాలు తీవ్రంగా ఖండించినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం సరిగ్గా స్పందించలేదని టీడీపీ శ్రేణుల నుంచి విమర్శలు వచ్చాయి.
దీనిని మనసులో పెట్టుకొని ఆ మధ్య తారకరత్న చనిపోయినప్పుడు నారా, నందమూరి ఫ్యామిలీలు జూనియర్ ఎన్టీఆర్ ను పెద్దగా పట్టించుకోలేదని ప్రచారం జరిగింది. పైగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చంద్రబాబు ఏ సభ నిర్వహించినా అక్కడికి వెళ్లి ఎన్టీఆర్ కాబోయే సీఎం..అంటూ నినాదాలు చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారన్న ప్రచారం ఉంది.
ఈ నేపథ్యంలో టీడీపీ గెలుపుపై ఎన్టీఆర్ ఏ విధంగా స్పందిస్తారన్న ఆసక్తి అందరిలో రేకెత్తింది. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతి రోజు జూనియర్ ఎన్టీఆర్ స్పందించి తన మావయ్య చంద్రబాబుకు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. అయితే దీనిపై కూడా టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ పై విమర్శలు చేశాయి. ఇంత ఆలస్యంగానా శుభాకాంక్షలు చెప్పేదని మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ కి స్పందిస్తూ ధన్యవాదాలు చెప్పడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.