మీ పర్మిషన్ లేకుండానే కర్నూలులో ర్యాలీ తీస్తాం, అమిత్ షాతో సభ పెడతాం, ఏం చేస్తారో చేసుకోండి... జగన్ కు సీఎం రమేష్ సవాల్
రోడ్లపై ప్రమాదాలు జరుగుతున్నాయని రోడ్లను మూసేసి ప్రజలను తిరగకుండా చేస్తామా ? అని సీఎం రమేష్ ప్రశ్నించారు. అధికార పక్షం ప్రతిపక్షాలను ఎంతగా అణచివేయాలనుకుంటే అంతగా ప్రజలు తిరగబడతారని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ సభల్లో ఈ మధ్య జరిగిన తొక్కిసలాట , మరణాల నేపథ్యంలో ప్రభుత్వం రోడ్లపై ర్యాలీలు, సభలు నిర్వహించకుండా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ జగన్ సర్కార్ పై విరుచుకపడ్డారు.
ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రోడ్లపై ప్రమాదాలు జరుగుతున్నాయని రోడ్లను మూసేసి ప్రజలను తిరగకుండా చేస్తామా ? అని ప్రశ్నించారు. అధికార పక్షం ప్రతిపక్షాలను ఎంతగా అణచివేయాలనుకుంటే అంతగా ప్రజలు తిరగబడతారని ఆయన అన్నారు.
ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదని, ఆ బాధ్యతను విస్మరించి, తొక్కిసలాటను, మరణాలను సాకుగా చూపి ఎవ్వరూ గొంతు ఎత్తకుండా చేస్తున్నారని రమేష్ మండి పడ్డారు.
త్వరలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కర్నూలుకు వస్తున్నారని... ఈ సందర్భంగా బీజేపీ ర్యాలీ నిర్వహిస్తుందని, సభ పెడుతుందని, అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తుందని... తమ పార్టీ కార్యక్రమాలకు మీ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదని రమేష్ చెప్పారు. సభలు పెట్టకూడదనే జీవోను వెంటనే రద్దు చేసి, మీ తప్పిదాలను ఎలా సరిదిద్దుకోవాలో ఆలోచిస్తే బాగుంటుందని హితవు పలికారు.
గత ప్రభుత్వం కూడా ఇదే విధంగా ఆలోచించి ఉంటే జగన్ పాదయాత్ర కొనసాగేదా? అని ఆయన ప్రశ్నించారు. జగన్ పాదయాత్రకు అప్పటి ప్రభుత్వం అన్ని విధాలా రక్షణ కల్పించలేదా? అని ప్రశ్నించారు.