సీఎం జగన్ సంచలన ప్రకటన.. విశాఖే రాజధాని.. నేను కూడా త్వరలో షిఫ్ట్ అవుతున్నా!
Andhra Pradesh Capital: విశాఖ రాజధాని అయ్యాక మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని సీఎం జగన్ వెల్లడించారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ సంచలన ప్రకటన చేశారు. విశాఖపట్నం త్వరలోనే రాజధాని (పరిపాలన) కాబోతోందని స్పష్టం చేశారు. తాను కూడా త్వరలో వైజాగ్ షిఫ్ట్ అవుతున్నట్లు తెలిపారు. ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో మంగళవారం నిర్వహించిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం జగన్ పాల్గొనారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. విశాఖలో పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానిస్తున్నామన్నారు. ఇక్కడకు వచ్చిన వారితో పాటు ఇతర కంపెనీ ప్రతినిధులను కూడా ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని చూపించాలని ఆయన ఇన్వెస్టర్లను కోరారు.
మార్చి 3,4 తేదీల్లో విశాఖపట్నంలో ఇన్వెస్టర్ల సదస్సు జరుగనుందని.. అక్కడకు అందరూ తప్పకుండా రావాలని కోరారు. మీ అందరినీ మరోసారి విశాఖలో కలవాలని ఆకాంక్షిస్తున్నట్లు జగన్ తెలిపారు. ఏపీని ప్రపంచ వేదిక మీద నిలబెట్టడానికి మీ అందరి సహకారం అవసరం అని చెప్పారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు మా వంతు తోడ్పాటు అందిస్తామని అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ గత మూడేళ్లుగా నెంబర్ వన్ పొజిషన్‌లో ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రం పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నదని ఇన్వెస్టర్లకు తెలియజేశారు.
ఏపీకి సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని.. 11.43 శాతం వృద్ధి రేటుతో దేశంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతోందని అన్నారు. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న 11 ఇండస్ట్రియల్ కారిడార్లలో మూడు ఏపీకే రావడం శుభ పరిణామం అన్నారు. ఈ విషయంలో ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. సింగిల్ డెస్క్ సిస్టమ్ ద్వారా 21 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని సీఎం జగన్ వెల్లడించారు. విశాఖ రాజధాని అయ్యాక మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని సీఎం చెప్పుకొచ్చారు.