ఫోన్ ట్యాపింగ్ చేయించింది చంద్రబాబే.. - ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు
గతంలో తన ఫోన్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ట్యాపింగ్ చేయించారంటూ చంద్రబాబు ఆరోపించాడని, ఇప్పుడు అదే మోడీతో ఆయన పొత్తు పెట్టుకున్నాడని కేశినేని నాని దుయ్యబట్టారు.
ప్రతిపక్షాలు చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై విజయవాడ ఎంపీ కేశినేని నాని ఘాటుగా స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ అలవాటు చంద్రబాబుకే ఉందని ఆయన చెప్పారు. టీడీపీ అధికారంలో ఉండగా ఏబీ వెంకటేశ్వరరావుతో ఫోన్ ట్యాపింగ్ చేయించింది చంద్రబాబేనని ఆయన స్పష్టం చేశారు. విజయవాడలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గతంలో తన ఫోన్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ట్యాపింగ్ చేయించారంటూ చంద్రబాబు ఆరోపించాడని, ఇప్పుడు అదే మోడీతో ఆయన పొత్తు పెట్టుకున్నాడని కేశినేని నాని దుయ్యబట్టారు. చంద్రబాబు ఇప్పుడు ఎన్డీయేలోనే ఉన్నారుగా.. దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరిపించండి.. అంటూ ఆయన సవాల్ చేశారు.
తన ఫోన్‌ని 2018 నుంచి ట్యాప్ చేస్తున్నారని, తన ఫోన్ ట్యాప్ చేసుకున్నా తనకేమీ భయం లేదని కేశినేని నాని స్పష్టం చేశారు. సీఎం జగన్‌కి, తనకు ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం లేదని ఆయన తేల్చిచెప్పారు. ఫోన్ ట్యాప్ చేయడానికి కానిస్టేబుల్‌ని పంపిస్తారా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు హైదరాబాద్‌లో ఉండి ఫోన్ ట్యాప్ చేయిస్తున్నారని కేశినేని నాని విమర్శించారు.
ఇంకా నాని మాట్లాడుతూ.. విశాఖలో డ్రగ్స్ తెప్పించింది చంద్రబాబు సన్నిహితులేనని చెప్పారు. లోఫర్లు, చీటర్లు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు టీడీపీ సీట్లు ఇచ్చిందని ఆయన విమర్శించారు. ఇక మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చాప్టర్ అయితే క్లోజ్ అయిపోయిందని ఆయన చెప్పారు. రూ.100 కోట్లకు చంద్రబాబు ఆ సీటును అమ్మేశాడని దేవినేని ఉమానే చెప్పాడని కేశినేని నాని గుర్తుచేశారు.