వైసీపీ నేతలు, ఫిరాయింపుదార్ల మధ్యే పోటీ
టీడీపీ, జనసేన పార్టీలు కేడర్ ని ఎందుకు ప్రోత్సహించడంలేదని ప్రశ్నించారు విజయసాయిరెడ్డి. సొంత నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి ప్రతిపక్షాలు ఎందుకు భయపడుతున్నాయని అన్నారు.
రాబోయే ఎన్నికలు వైసీపీ నేతలు, వైసీపీ ఫిరాయింపుదార్ల మధ్య పోటీగా మారాయని అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిపై ఆయన సెటైర్లు పేల్చారు. కూటమికి అభ్యర్థులే దొరకడంలేదా అని ప్రశ్నించారాయన. ఎవరూ దొరక్క చివరకు వైసీపీ ఫిరాయింపుదార్లకు టికెట్లు ఇచ్చారని అన్నారు. ఈ ఎన్నికలు తమ నేతలకు, ఫిరాయింపుదార్లకు మధ్య పోటీగా కనపడుతున్నాయని, అంతిమ విజయం వైసీపీదేనని అన్నారు విజయసాయి రెడ్డి. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ వేశారు.
ఎందుకు ప్రోత్సహించరు..?
టీడీపీ, జనసేన పార్టీలు కేడర్ ని ఎందుకు ప్రోత్సహించడంలేదని ప్రశ్నించారు విజయసాయిరెడ్డి. సొంత నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి ప్రతిపక్షాలు ఎందుకు భయపడుతున్నాయని అన్నారు. ఆ రెండు పార్టీలు వారి కార్యకర్తలను ఎందుకు నమ్మడంలేదని, వారినుంచి లీడర్లను ఎందుకు పైకి తీసుకు రావడంలేదని, వారికి టికెట్లిచ్చి ఎందుకు ప్రోత్సహించడంలేదని ప్రశ్నించారు. తమ కేడర్ కి అన్యాయం చేస్తూ వైసీపీనుంచి వచ్చిన వారికి టికెట్లు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి.
2019 ఎన్నికల్లో కూడా ఎంతోమంది సామాన్యులకు టికెట్లిచ్చి ఆశ్చర్యపరిచారు సీఎం జగన్. 2024లో కూడా అదే పరిస్థితి కనపడుతోంది. ప్రజల్లో ఆదరణ లేని మంత్రుల్ని సైతం ఆయన పక్కనపెట్టారు. వారి స్థానంలో సామాన్యులకు పెద్దపీట వేశారు. జడ్పీటీసీలను సైతం ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించారు. పార్టీ కేడర్ ని ప్రోత్సహించి, నాయకులుగా తీర్చిదిద్దుతున్నారు. అయితే కూటమి మాత్రం పక్క పార్టీ నాయకులపై ఆధారపడిందని విమర్శించారు విజయసాయిరెడ్డి. నెల్లూరు నుంచి విజయసాయిరెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా వైసీపీ నుంచి ఫిరాయించిన నేత కావడం విశేషం.