అంబేద్కర్ విగ్రహంపై దాడి దారుణం -విజయసాయి

అంబేద్కర్ స్మృతివనంపై జరిగిన దాడిని వైసీపీ తీవ్రంగా ఖండిస్తోంది. దళిత సంఘాలతో పాటు వైసీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు.

Advertisement
Update:2024-08-11 09:34 IST

సామాజిక న్యాయానికి ప్రతీకగా ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం దారుణం అని అన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇది హేయమైన చర్య అని ఆయన అభివర్ణించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సిద్ధాంతాలు, ఆశయాలు టీడీపీకి అందనంత దూరంలో ఉన్నాయని చెప్పారు. సమానత్వం, సామాజిక న్యాయం, సాధికారత అనే అంబేద్కర్ దృక్పథాన్ని అణగదొక్కడానికి టీడీపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. విజయవాడలో అంబేద్కర్ స్మృతి వనంపై జరిగిన దాడిని విజయసాయిరెడ్డి తీవ్రంగా ఖండించారు.


అంబేద్కర్ స్మృతివనంపై జరిగిన దాడిని వైసీపీ తీవ్రంగా ఖండిస్తోంది. దళిత సంఘాలతో పాటు వైసీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకాలు చేశారు, ప్రభుత్వ ప్రోత్సాహంతోనే టీడీపీ మూకలు ఈ దాడికి పాల్పడ్డాయని వారు విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. వైసీపీ నేతలు, దళిత సంఘాల నాయకులు ఈ ప్రదర్శనలో పాల్గొని దాడి ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


టీడీపీ కూడా ఈ దాడి విషయంలో గట్టిగా కౌంటర్ ఇస్తోంది. స్మృతివనంలో అంబేద్కర్ పేరు కంటే పెద్దగా జగన్ తన పేరు రాయించుకున్నారని, ఆ పేరుని ఎవరో తొలగిస్తే దాన్ని విగ్రహంపై జరిగిన దాడి అనడం సరికాదని అంటున్నారు టీడీపీ నేతలు. ఈ క్రమంలో కొందరు వైసీపీ కార్యకర్తలు చంద్రబాబుపై చేస్తున్న వ్యాఖ్యల్ని టీడీపీ నేతలు ఖండించారు. అహంకారంతో అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. 



Tags:    
Advertisement

Similar News