'గెట్ వెల్ సూన్..' హోరెత్తిపోతున్న సోషల్ మీడియా
పిఠాపురం చుట్టేసే సరికే పవన్ కి జ్వరం వచ్చింది. కనీసం నాదెండ్ల మనోహర్ కోసం ఆయన తెనాలి కూడా వెళ్లలేకపోయారు. మధ్యలోనే విరామం ఇచ్చారు.
పవన్ కల్యాణ్ వారాహి విజయభేరి యాత్ర వాయిదా పడింది. కనీసం మూడు రోజులపాటు ఆయన యాత్ర మొదలు పెట్టే పరిస్థితి లేదు. జ్వరం కారణంగా కల్యాణ్ కి పూర్తి విశ్రాంతి కావాలని డాక్టర్లు సూచించారని, అందుకే యాత్ర వాయిదా వేశారని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఇక చూడండి, సోషల్ మీడియాలో 'గెట్ వెల్ సూన్..' అనే మెసేజ్ లు హోరెత్తిపోతున్నాయి. అది సింపతీనా లేక ట్రోలింగా అర్థం కాని రేంజ్ లో మెసేజ్ లు పెడుతున్నారు నెటిజన్లు.
సింపతీ కాదు.. ట్రోలింగే
పవన్ కల్యాణ్ వందల కిలోమీటర్లు నడిచిన తర్వాత పర్యటన వాయిదా పడిందా..?
వేల కిలోమీటర్లు బస్సు యాత్ర చేసిన తర్వాత జ్వరం వచ్చిందా..?
ఎండల్లో జనం మధ్య నియోజకవర్గం మొత్తం కలియదిరిగిన తర్వాత ఆరోగ్యం పాడైందా..?
ఇవేవీ కావు.. జస్ట్ నాలుగురోజులపాటు సొంత నియోజకవర్గంలో వారాహి వాహనం ఎక్కి తిరిగే సరికి ఆయనకు ఆరోగ్యం పాడైంది. అందులో సగం టైమ్ చేరికలు, మీటింగ్ లతోనే సరిపెట్టారు. అంతలోకే ఆయన ఆరోగ్యం పాడైందా అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. ఇదంతా తాము ముందే ఊహించామని అంటున్నారు నెటిజన్లు. సీఎం జగన్ పర్యటనలు చూసి, వైసీపీకి పెరుగుతున్న ఆదరణ చూసి పవన్ కల్యాణ్ కి దడుపు జ్వరం వచ్చిందని సెటైర్లు పేలుస్తున్నారు.
మళ్లీ ఎప్పుడు..?
ముందు పిఠాపురం యాత్ర ముగించుకుని, తర్వాత జనసేన అభ్యర్థులు పోటీ చేసే నియోజకవర్గాలన్నీ చుట్టేయాలనేది పవన్ షెడ్యూల్. దానికి తగ్గట్టే రూట్ మ్యాప్ కూడా ఖరారు చేశారు. కానీ పిఠాపురం చుట్టేసే సరికే పవన్ కి జ్వరం వచ్చింది. కనీసం నాదెండ్ల మనోహర్ కోసం ఆయన తెనాలి కూడా వెళ్లలేకపోయారు. మధ్యలోనే విరామం ఇచ్చారు. రెండు మూడు రోజులు విశ్రాంతి అవసరం అని వైద్యులు చెప్పినట్టు జనసేన ప్రకటించింది కాబట్టి ఆ తర్వాతే యాత్ర తిరిగి మొదలవుతుంది. రీ షెడ్యూల్ ని త్వరలో ప్రకటిస్తామని పార్టీ నేతలు తెలిపారు.