అనుమతులా? ఆటంకాలా..? ఏపీలో వారాహి పొలిటికల్ హీట్

వారాహి సాఫీగా సాగిపోతే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. పోలీసులు అడ్డుచెబితే, వారిని దాటుకుని పవన్ ముందుకెళ్తే.. అప్పుడే క్రేజ్ వస్తుందనేది ఆ పార్టీ ఆలోచనగా తెలుస్తోంది.

Advertisement
Update:2023-06-13 06:31 IST

ఏపీలో ఈనెల 14నుంచి వారాహి రోడ్డెక్కబోతోంది. యాత్రకు రెండు రోజుల ముందు అమరావతిలో జనసేన పార్టీ ఆఫీస్ నిర్మాణం కోసం భూమిపూజ చేశారు పవన్ కల్యాణ్. హోమాలు నిర్వహించారు. వారాహికి ఆటంకాలు లేకుండా యాగం పూర్తి చేశారు. రేపటినుంచి యాత్ర మొదలవుతున్న నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నానికే పవన్ కల్యాణ్ తూర్పుగోదావరి జిల్లాకు చేరుకుంటారు. రేపు అన్నవరం సత్యదేవుని ఆశీస్సులు తీసుకుని యాత్ర మొదలు పెడతారు. రేపు సాయంత్రం 4 గంటలకు కత్తిపూడిలో తొలి బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు జనసేన నేతలు.

అనుమతులా? ఆటంకాలా..?

ఈనెలాఖరు వరకు సెక్షన్ 30 అమలులో ఉంటుందని పోలీసులు ఇదివరకే స్పష్టం చేయడంతో, ఇవన్నీ వారాహిని అడ్డుకునే ప్రయత్నాలంటూ ఆరోపణలు వినిపించాయి. మరోవైపు సభలు, సమావేశాలు, ర్యాలీలకు ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉంది. మైక్ పర్మిషన్ కూడా తీసుకోవాలి. అది లేకపోతే ర్యాలీలో చేతులు ఊపుకుంటూ వెళ్లాల్సిందే. పోలీసులు కావాలనే ఇలాంటి కండిషన్లు పెట్టారంటూ మండిపడుతున్నారు జనసైనికులు. వారాహి యాత్రపై జనసేన నేతలు తమకు ముందస్తు సమాచారం మాత్రమే ఇచ్చారని, భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలంటే మినిట్‌ టు మినిట్‌ షెడ్యూల్‌ ఇవ్వాల్సిందేనంటున్నారు పోలీసులు. క్షేత్రస్థాయి పర్యటన అని మాత్రమే చెప్పారని, ఎక్కడెక్కడ పర్యటిస్తారు, ఎక్కడెక్కడ సభలు పెడతారు, ఎక్కడ ఆయన ఆగి మాట్లాడతారో కూడా చెప్పాలంటున్నారు.

పోలీసులు అడిగిన వివరాలు ఇస్తే అనుమతులు రావడానికి పెద్ద ఇబ్బంది ఉండదు. పంతానికి పోతే మాత్రం పెద్ద సీన్ క్రియేట్ అవుతుంది. ప్రస్తుతానికి పవన్ కల్యాణ్ కి కావాల్సింది కూడా అదే. వారాహి సాఫీగా సాగిపోతే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. పోలీసులు అడ్డుచెబితే, వారిని దాటుకుని పవన్ ముందుకెళ్తే.. అప్పుడే క్రేజ్ వస్తుందనేది ఆ పార్టీ ఆలోచనగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సహజంగానే కాస్త హడావిడి జరుగుతోంది. యాత్రలో పవన్ పేల్చే పొలిటికల్ పంచ్ డైలాగులపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే యువగళంలో నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు, ఇటీవలే బీజేపీ నుంచి కూడా జగన్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు మొదలయ్యాయి. ఇప్పుడు పవన్ ముప్పేట దాడిలో భాగస్వామి కాబోతున్నారు. వారాహి రోడ్డెక్కితే ఏపీ రాజకీయాలు మరింత హీటెక్కుతాయనడంలో సందేహం లేదు. 

Tags:    
Advertisement

Similar News