వ‌ర‌దాపురం సూరి.. టీడీపీలో చేరేందుకు ఏదీ దారి..?

వ‌ర‌దాపురం సూరి టీడీపీని వీడ‌టంతో ధ‌ర్మ‌వరం బాధ్య‌త‌లు ప‌రిటాల శ్రీరామ్ కి అప్ప‌గించారు. దీంతో టీడీపీలో చేరాల‌ని చూసినా సీటు హామీ దొరికే అవ‌కాశంలేదు.

Advertisement
Update:2023-01-06 15:04 IST

గోనుగుంట్ల సూర్య‌నారాయ‌ణ అలియాస్ వ‌ర‌దాపురం సూరి ప్ర‌స్తుతం బీజేపీ నాయ‌కులు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అంటే మాత్రం స‌మాధానం క్వ‌శ్చ‌న్ మార్క్. అనంత‌పురం జిల్లా ధ‌ర్మ‌వ‌రం స్థానం నుంచి పోటీ చేయాల‌నుకుంటున్న సూరికి బీజేపీలో ఉంటే డిపాజిట్లు రావు. వైసీపీలోకి వెళ్లాలంటే సీటు ఖాళీలేదు. సొంత గూటికి మ‌ళ్లీ చేరుదామంటే అక్క‌డ శ్రీరామ్ సెటిలైపోయాడు. ఏం చేయాలో తెలియ‌ని స్థితిలో వ‌ర‌దాపురం సూరి టీడీపీలో చేరే దారేది అని యోచిస్తున్నాడు.

2009లో జరిగిన ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గం నుంచి స్వ‌తంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేతిలో 19,172 ఓట్ల తేడాతో ఓడిపోయిన గోనుగుంట్ల సూర్య‌నారాయ‌ణ టీడీపీలో చేరారు. 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి, వైసీపీ అభ్య‌ర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై 14,211 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి శాస‌న‌స‌భ్యుడిగా ఎన్నిక‌య్యారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండ‌టంతో సూరి హ‌వా నియోజ‌క‌వ‌ర్గంలో బాగానే సాగింది. 2019లో ఎన్నికల్లో మ‌రోసారి టీడీపీ అభ్యర్థిగా బ‌రిలోకి దిగిన సూరిపై వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి భారీ మెజారిటీతో విజ‌యం సాధించారు. ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ కూడా ఘోర ప‌రాజ‌యం పాల‌వ‌డంతో వ‌ర‌దాపురం సూరి పార్టీకి దూరం అవుతూ వ‌చ్చారు. అధికారంలో ఉన్న‌ప్ప‌టి నిర్ణ‌యాలు వెంటాడుతుండ‌టంతో కేసుల భ‌యంతో టీడీపీని వీడి బీజేపీలో చేరారు.

అయితే కేసుల నుంచి తాత్కాలిక ర‌క్ష‌ణ అయితే దొరికింది గానీ, ఏపీలో బీజేపీ ఒక్క స్థాన‌మైనా గెలిచే అవ‌కాశంలేదు. బీజేపీ-జ‌న‌సేన క‌లిసి వున్నా టీడీపీతో పొత్తు కుదిరే అవ‌కాశం లేదు. ఇలా అయితే బీజేపీ అభ్య‌ర్థిగా దిగితే కేతిరెడ్డిపై గెల‌వ‌డం అసాధ్యం. జ‌న‌సేన‌లో ఇప్పుడు చేరినా టికెట్ భ‌రోసా ద‌క్క‌దు. టీడీపీలో చేరాలంటే అక్క‌డ ప‌రిటాల ర‌వి త‌న‌యుడు ప‌రిటాల శ్రీ‌రామ్ పాతుకుపోయాడు. వ‌ర‌దాపురం సూరి టీడీపీని వీడ‌టంతో ధ‌ర్మ‌వరం బాధ్య‌త‌లు ప‌రిటాల శ్రీరామ్ కి అప్ప‌గించారు. దీంతో టీడీపీలో చేరాల‌ని చూసినా సీటు హామీ దొరికే అవ‌కాశంలేదు. ధ‌ర్మ‌వ‌రం సీటు ఇస్తామంటే టీడీపీలో చేర‌డానికి తాను సిద్ధ‌మంటూ అధిష్టానానికి రాయ‌భారాలు పంపుతున్నారు సూరి. అయితే అటువైపు నుంచి ఎటువంటి స్పంద‌న లేదు. దీంతో బీజేపీలో ఉండ‌లేక‌, టీడీపీలో చేరే దారిలేక తీవ్ర ఆందోళ‌న‌లో వ‌ర‌దాపురం సూరి ఉన్నార‌ని స‌న్నిహితులు చెబుతున్న మాట‌.

Tags:    
Advertisement

Similar News