రంగా విగ్రహావిష్కరణలో వైసీపీ నేతలు.. రాధాపై నాని పొగడ్తలు
ఆయనకు డబ్బు అవసరం లేదని, రాజ్యసభ సీటు ఇస్తామన్నా వద్దంటారని, తండ్రి పేరు నిలబెట్టడమే తనకు ముఖ్యమని అంటారని చెప్పారు.
విజయవాడలో జరిగిన వంగవీటి మోహనరంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైసీపీకి చెందిన నేతలు పాల్గొనడం విశేషం. ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఎంపీ బాలశౌరి ఈ కార్యక్రమంలో పాల్గొని రంగా ఆశయాలను, ఆయన ప్రజలకు చేసిన సేవలను, ప్రజల కోసం చేసిన ప్రాణ త్యాగాన్ని కొనియాడారు. ఆయన ఆశయాలకోసమే రాధా జీవిస్తున్నారని చెప్పారు. వాస్తవానికి టీడీపీ నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని అనుకున్నా.. వైసీపీ నుంచి నాని, వంశీ వచ్చే సరికి ప్లానింగ్ పూర్తిగా మారిపోయింది.
నా తమ్ముడు రాధా ఎలాంటి వాడంటే..?
రంగా ఆశయాలతో రాధా జీవిస్తున్నారని, కుటుంబం కోసం కనీసం డబ్బు కూడా ఆశించకుండా ఓ చిన్న కుటీరం ఏర్పాటు చేసుకుని ఉంటున్నారని పొగడ్తల్లో ముంచెత్తారు కొడాలి నాని. ఆయనకు డబ్బు అవసరం లేదని, రాజ్యసభ సీటు ఇస్తామన్నా వద్దంటారని, తండ్రి పేరు నిలబెట్టడమే తనకు ముఖ్యమని అంటారని చెప్పారు. రాధా అడిగితే విజయవాడలో వెయ్యి ఇళ్లు ఖాళీ చేసి ఇస్తారని, కానీ ఆయన ఆ చిన్న ఇంట్లోనే ఉండిపోయారని చెప్పారు.
వారి పాపాలకు శిక్ష అదే..
1983లో టీడీపీలో రంగా శత్రువులు చేరారని.. రంగాను హత్య చేశారని ఆరోపించారు కొడాలి నాని. రంగాను హతమార్చిన దుర్మార్గులు ఎంత దుస్థితిలో ఉన్నారో అందరికీ తెలుసన్నారు. రంగా ఓ ప్రాంతానికో.. కులానికో.. పార్టీలకో పరిమితం కాదని వంగవీటి రాధా అన్నారు. అందుకే పార్టీలకతీతంగా అందరూ రంగాను అభిమానిస్తారని చెప్పారు. పదవులు ఐదేళ్లు ఉంటాయని, ఆ తర్వాత పోతాయని, కానీ రంగా గారి అబ్బాయనేదే తనకు పెద్ద పదవి అన్నారు రాధా. ఓ సామాన్యుడిగా అందరితో కలిసి ఉండడమే తనకు ఇష్టమన్నారు.