లేదనే సమాధానం కోసమే హోదా అడిగారా..?

ఏపీకి ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయమని మరోసారి లోక్‌ సభలో కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ వెల్లడించారు.

Advertisement
Update:2022-07-20 08:33 IST

"ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం". ఇప్పటికి కొన్ని వందలసార్లు ఈ మాట పార్లమెంట్ లో ప్రతిధ్వనించి ఉంటుంది. కానీ పదే పదే ఏపీ ఎంపీలు, ముఖ్యంగా టీడీపీ ఎంపీలు ఈ ప్రశ్న అడగటం, కేంద్రం లేదని చెప్పడం, ఏపీ మీడియా ముగిసిన అధ్యాయం అంటూ హెడ్డింగ్ పెట్టడం.. బాగా రొటీన్ అయిపోయాయి. అసలు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కేంద్రానికి ఏమాత్రం ఇష్టం లేదనే విషయం తేలిపోయింది. పోనీ ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నా కూడా కేంద్రం ఆ సాహసం చేయలేదనే విషయం అర్థమైపోయింది. అయినా పదే పదే రాజకీయ పార్టీలు ఏపీకి ప్రత్యేక హోదా అనే అంశాన్ని తెరపైకి తెస్తున్నాయి. కేంద్రంతో లేదు, కుదరదు, వీలుకాదు అనే సమాధానం చెప్పిస్తూ ప్రజలను వంచిస్తున్నాయి.

తాజాగా మొదలైన పార్లమెంట్ సమావేశాల్లో కూడా మళ్లీ ఇదే తంతు మొదలైంది. ఏపీకి ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయమని మరోసారి లోక్‌ సభలో కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ వెల్లడించారు. టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. ఏపీకే కాకుండా ఏ ఇతర రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇచ్చేందుకు 14వ ఆర్థికసంఘం ప్రాధాన్యత ఇవ్వలేదని, 15వ ఆర్థిక సంఘం కూడా ఇవే సిఫారసులు చేసిందని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాకు బ‌దులుగా కేంద్రం ప‌న్నుల్లో రాష్ట్రాల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచామన్నారు. రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రాల‌కు అద‌న‌పు నిధులు కేటాయించిన‌ట్లు వెల్లడించారు.

ఏపీకి ప్ర‌త్యేక‌ హోదా ఎంతెంత దూరం..?

కేంద్రంలో హంగ్ ఏర్పడితే, ఆ హంగ్ లో ఏపీ నుంచి గెలిచిన ఎంపీల పాత్రక కీలకం అయితే అప్పుడు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదా సాధించవచ్చనేది మన నేతల ఆలోచన. కానీ ఇప్పట్లో అలాంటి పరిస్థితులు ఉంటాయని అనుకోలేం. ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినా, ఏపీకి హోదా ఇచ్చి ఆ తేనెతుట్టెను ఏ హంగ్ సర్కారు కూడా కదిలించలేదు. పోనీ కేంద్రానికి అంత దయ ఉంటే.. ఈపాటికి విభజన హామీలనైనా అమలు చేసేది. పోలవరం మరీ అంత నత్తనడకన సాగేది కాదు. హోదా ఇవ్వరు, నిధులివ్వరు, విభజన హామీలలో పేర్కొన్న సంస్థల ఏర్పాటుకి ముందుకి రారు. కేంద్రం వ్యవహారం ఏంటో స్పష్టంగా తెలిసినా రాష్ట్ర ఎంపీలు మాత్రం ఆ ప్రశ్న అడగకుండా ఉండలేరు. ప్రశ్నలు అడిగితే కేంద్రాన్ని ఇరుకున పెట్టినట్టు భావిస్తే ఎలా..? పోనీ ప్రశ్నలతోనే భయపడి కేంద్రం హోదా ఇస్తుందా..? ఏదేమైనా పార్లమెంట్ లో ఏపీ ప్రత్యేక హోదా అనే ప్రశ్న ముగింపు లేని అధ్యాయం.

Tags:    
Advertisement

Similar News