నన్ను అనుమానించొద్దు.. ఎమ్మెల్యే శ్రీదేవి ఆవేదన

పార్టీ నిర్ణయాన్ని తానెప్పుడూ ధిక్కరించలేదని చెబుతున్నారు. తనపై అనుమానం రావడం సహజమేనంటున్న ఆమె, నిర్థారణ చేసి మాట్లాడటం సరికాదని చెప్పారు.

Advertisement
Update:2023-03-23 21:52 IST

వైసీపీలో క్రాస్ ఓటింగ్ కి పాల్పడిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు...? ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చంతా దీని చుట్టూనే తిరుగుతోంది. టీడీపీకి వాస్తవంగా 19 ఓట్లు ఉన్నాయి. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, ఆనం కలుపుకుంటే.. 21. కానీ మరో రెండు ఓట్లు అదనంగా పడ్డాయి. ఈ రెండు ఓట్లు వేసింది ఎవరు, వైసీపీలో జగన్ ని కాదని అంత సాహసం చేసింది ఎవరు..? వైసీపీ నేతలు నేరుగా బయటపడటం లేదు కానీ మీడియాకి లీకులిచ్చారు. ఆ లీకుల ప్రకారం లిస్ట్ లో ఉన్న ఇద్దరిలో ఒకరు నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మరొకరు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. వీరిద్దరి పేర్లు మీడియాలో కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే ఎమ్మెల్యే శ్రీదేవి మాత్రం తనను అనుమానించొద్దని అంటున్నారు.

తాడికొండ నియోజకవర్గానికి ఎమ్మెల్యే శ్రీదేవి ఉన్నా కూడా ఇటీవల ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ని అక్కడ వైసీపీ ఇన్ చార్జ్ గా నియమించింది. దీంతో ఆమె అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. తన నియోజకవర్గంలో సమస్యలు ఉన్నమాట వాస్తవమే కానీ, తాను పార్టీని వదిలిపెట్టి వెళ్లే రకం కాదని అంటున్నారు శ్రీదేవి, పార్టీ నిర్ణయాన్ని తానెప్పుడూ ధిక్కరించలేదని చెబుతున్నారు. తనపై అనుమానం రావడం సహజమేనంటున్న ఆమె, నిర్థారణ చేసి మాట్లాడటం సరికాదని చెప్పారు.

ఇక వచ్చేసారి తనకు వైసీపీ టికెట్ రాదనే అనుమానంతోనే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీ అభ్యర్థికి ఓటు వేశారనే ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ కేవలం ప్రచారాలే కానీ వారిద్దరూ ఓటు టీడీపీకి వేశారనడానికి రుజువులేవీ లేవు. ఆ మాటకొస్తే వైసీపీ కూడా ఆ ఇద్దరి పేర్లు చెప్పడానికి తటపటాయిస్తోంది. డబ్బుకి అమ్ముడుపోయిన ఆ ఇద్దరూ ఎవరో తమకు తెలుసని, వారిపై తగిన సమయంలో తగిన చర్యలు తీసుకుంటామన్నారు సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు డబ్బు ఆశ చూపించి ఇద్దరి ఓట్లు కొనుగోలు చేశారని మండిపడ్డారు. ఈ ఎన్నికల ఫలితాలతో చంద్రబాబుకి ఒరిగేదేమీ లేదన్నారు. దమ్ముంటే 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను పోటీకి దింపుతామని చంద్రబాబు చెప్పాలంటూ సవాల్ విసిరారు సజ్జల. 

Tags:    
Advertisement

Similar News