ఏపీలో ఓట్ల లెక్కింపులో అక్రమాలు.. ఉండపల్లి సంచలన ఆరోపణలు
కౌంటింగ్ అయిన 10 రోజుల్లోనే వీవీపాట్, ఇతర వివరాలను ధ్వంసం చేయమన్నారని, 20 రోజులైన ఎందుకు వాటిని ధ్వంసం చేయలేదని అందులో మీనా ప్రశ్నించారన్నారు.
ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. వైసీపీ నేతలు సైతం మొదటి నుంచి ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బాలినేని ఈ విషయంపై సుప్రీంకోర్టుకు వెళ్తానని చెప్పారు. తాజాగా ఇదే విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.
ఉండవల్లి ఏమన్నారంటే!
మహారాష్ట్రకు చెందిన ఓట్ ఫర్ డెమోక్రసీ ఓ రిపోర్టు ఇచ్చిందని, ఆ రిపోర్టు ప్రకారం ఏపీలో పోలైన ఓట్ల కంటే 12.54 శాతం ఓట్లు ఎక్కువగా లెక్కబెట్టారని చెప్పిందన్నారు. 12.54 శాతం అంటే మామూలు విషయం కాదన్నారు. ఒడిశాలోనూ 12.48 ఓట్లు ఎక్కువ లెక్క పెట్టారని రిపోర్టులో చెప్పారన్నారు. ఈ రిపోర్టు సోషల్‌మీడియాలో ఫుల్ సర్క్యూలేట్ అవుతోందన్నారు. ఇది తప్పయితే ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థపై నిషేధం విధించి చర్యలు తీసుకోవాలన్నారు.
ఈవీఎంలను మొదటగా వ్యతిరేకించింది చంద్రబాబేనన్నారు ఉండవల్లి. ఈ అనుమానాలను క్లియర్ చేయాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు. ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థలో ఉన్నవాళ్లంతా ప్రముఖులేనని చెప్పారు. తనకు దేశాయ్ అనే వ్యక్తి ఓ మెసేజ్ పంపారని చెప్పిన ఉండవల్లి.. అందులో స్టేట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మీనా 26-06-2024 నాడు ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయన్నారు. కౌంటింగ్ అయిన 10 రోజుల్లోనే వీవీపాట్, ఇతర వివరాలను ధ్వంసం చేయమన్నారని, 20 రోజులైన ఎందుకు వాటిని ధ్వంసం చేయలేదని అందులో మీనా ప్రశ్నించారన్నారు. అది చూసి తాను షాక్ అయ్యానన్నారు. వెంటనే దేశాయ్‌ని అడిగితే సెక్షన్ తీసి పంపించారని చెప్పారు. సెక్షన్ 81 ప్రకారం 45 రోజుల పాటు వీవీ పాట్‌లు సురక్షితంగా ఉంచాలని ఉందన్నారు. మీనా ఆదేశాలు అనుమానాలకు తావిస్తున్నాయన్నారు. వీటిపై చంద్రబాబు క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఉండవల్లి.