సీబీఐ విచారణ కోరితే టీడీపీకి ఎందుకు కోపం?
ఈ స్కామ్ వ్యవహారానికి సంబంధించి ఫైళ్లు మాయం చేశారని చెబుతున్నారని, పూణే జీఎస్టీ అధికారుల విచారణలో ఇది బయటపడిందని ఆయన చెప్పారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐతో విచారణ జరగాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. అందుకోసం తాను సీబీఐ విచారణ కోరుతూ పిటీషన్ వేస్తే.. టీడీపీకి ఎందుకు కోపం వస్తోందని ఆయన ప్రశ్నించారు.
ఈ కేసులో సీబీఐ ఎంక్వైరీ అడిగితే తప్పేంటని ఆయన నిలదీశారు. రాజమండ్రిలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రస్తుతం స్కిల్ స్కామ్ కేసుపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోందని చెప్పారు. స్కిల్ స్కామ్ కేసును జీఎస్టీ అధికారులు వెలికితీశారని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ స్కాం జరిగిందని జీఎస్టీ డీజీ తేల్చారని వివరించారు. ఈ స్కామ్ వ్యవహారానికి సంబంధించి ఫైళ్లు మాయం చేశారని చెబుతున్నారని, పూణే జీఎస్టీ అధికారుల విచారణలో ఇది బయటపడిందని ఆయన చెప్పారు.
స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుతో తమకు సంబంధం లేదని, తాము ఎలాంటి ఒప్పందాలూ చేసుకోలేదని సీమెన్స్ కంపెనీ చెప్పిందని ఉండవల్లి చెప్పారు. స్కిల్ స్కామ్‌పై చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే జీఎస్టీ లేఖ రాసిందని ఆయన తెలిపారు. అయినా చంద్రబాబు ఎందుకు ఎవరి మీదా చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
ఈ కేసులో ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టే చంద్రబాబును న్యాయస్థానం రిమాండుకు పంపిందని వివరించారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందనే విషయంలో ఎలాంటి అనుమానం లేదని ఆయన చెప్పారు. చంద్రబాబుకు తెలియకుండా స్కామ్ జరిగిందంటే ఎవరూ నమ్మరన్నారు. చంద్రబాబు తనకు తాను సీఈవో అనుకుంటాడని ఉండవల్లి ఈ సందర్భంగా చెప్పారు.