వైసీపీలో రెండో అరెస్ట్.. మాజీ ఎమ్మెల్యే సుధాకర్ కు బేడీలు

నెలరోజుల వ్యవధిలోనే వేర్వేరు కారణాలతో ఇద్దరు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు అరెస్ట్ కావడం విశేషం.

Advertisement
Update: 2024-07-04 08:46 GMT

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు వరుసగా అరెస్ట్ అవుతున్నారు. ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఇదివరకే పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ప్రస్తుతం నెల్లూరు జైలులో ఉన్నారు. తాజాగా మరో మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అరెస్ట్ ల సంఖ్య రెండుకి పెరిగింది.

కోడూమూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ ని ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు. తన ఇంట్లో పనిచేసే బాలికతో ఆయన అసభ్యంగా ప్రవర్తించారన్న కారణంతో కేసు నమోదైంది. ఈ ఘటన చాలాకాలం క్రితం జరగగా.. ఇటీవల దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, ఈరోజు కర్నూలులో సుధాకర్ ని అరెస్ట్ చేశారు.

ఏపీలో వైసీపీ కార్యకర్తలపై దాడులు పెరిగిపోతున్నాయని ఆ పార్టీ ఆరోపిస్తోంది. అదే సమయంలో టీడీపీ తమపై రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతోందని కూడా వైసీపీ నేతలు అంటున్నారు. నెలరోజుల వ్యవధిలోనే వేర్వేరు కారణాలతో ఇద్దరు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు అరెస్ట్ కావడం విశేషం. జరదొడ్డి సుధాకర్ 2019లో వైసీపీ టికెట్ పై కోడుమూరు నియోజకవర్గం నుంచి గెలిచారు. ఈ సారి ఆయనకు పార్టీ టికెట్ నిరాకరించింది. ఆయన స్థానంలో ఆదిమూలపు సతీష్ పోటీ చేశారు. అక్కడ టీడీపీ అభ్యర్థి బొగ్గుల దస్తగిరి విజయం సాధించారు. ఈ అరెస్ట్ పై వైసీపీ ఇంకా స్పందించలేదు. సుధాకర్ అరెస్ట్ ని రాజకీయ కక్షసాధింపు అనడానికి అవకాశం లేదు. బాలికతో ఆయన అసభ్య ప్రవర్తనకు సంబంధించిన వీడియో ప్రధాన సాక్ష్యంగా ఉంది. అయితే అది ఫేక్ వీడియో అని కొట్టిపారేసే అవకాశం కూడా లేకపోలేదు. మరి వైసీపీ రియాక్షన్ ఏంటో వేచి చూడాలి. 

Tags:    
Advertisement

Similar News