తిరుమలలో వాటర్ బాటిల్.. ధర కేవలం రూ.450

తిరుమలలో టీటీడీ ఆధ్వర్యంలో కాపర్, స్టీల్ వాటర్ బాటిళ్ల విక్రయాలను ప్రారంభించారు. భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ బాటిళ్ల విక్రయం చేపట్టినట్టు టీటీడీ తెలిపింది.

Advertisement
Update:2023-04-12 19:32 IST

తిరుమల కొండను ప్లాస్టిక్ రహితం చేయాలని కంకణం కట్టుకుంది టీటీడీ. ఏ రకమైన ప్లాస్టిక్ ఉత్పత్తులు తిరుమల కొండపై కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. కొండపై ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ విక్రయాన్ని చాన్నాళ్ల క్రితమే నిషేధించింది. ప్రసాదం తీసుకెళ్లే కవర్ల స్థానంలో పేపర్ బ్యాగ్స్, రీసైక్లింగ్ కవర్లను ప్రవేశ పెట్టింది. భక్తులు తమతో తీసుకొచ్చే బాటిళ్ల విషయంలో కూడా కఠిన నిబంధనలు అమలు చేస్తోంది.


భక్తులు కొండపైకి ఎక్కే సమయంలోనే ప్లాస్టిక్ కవర్లు, వాటర్ బాటిల్స్ తీసి పక్కనపడేస్తున్నారు. మరి కొండపైన మంచినీరు తాగాలంటే ఏం చేయాలి. ఇప్పటి వరకూ గాజు బాటిళ్లను షాపుల్లో విక్రయిస్తున్నారు. ఖరీదు కాస్త ఎక్కువే అయినా భక్తులకు తప్పడంలేదు. ఇప్పుడు టీటీడీ నేరుగా బాటిళ్ల విక్రయానికి పూనుకుంది. కాపర్ బాటిల్స్, స్టీల్ బాటిల్స్ ని ప్రవేశ పెట్టింది.

తిరుమలలో టీటీడీ ఆధ్వర్యంలో కాపర్, స్టీల్ వాటర్ బాటిళ్ల విక్రయాలను ప్రారంభించారు. భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ బాటిళ్ల విక్రయం చేపట్టినట్టు టీటీడీ తెలిపింది. తిరుమలలో అందుబాటులో ఉన్న ఈ బాటిళ్ల ధరలు కూడా ప్రకటించింది టీటీడీ.

కాపర్ బాటిల్ ధర రూ. 450, స్టీల్ బాటిల్ ధర రూ. 200 గా నిర్ణయించింది. ప్రస్తుతం ఈ బాటిళ్లను పద్మావతి విచారణ కార్యాలయంలో విక్రయిస్తున్నారు. భక్తుల స్పందన ఆధారంగా తిరుమలలోని అన్ని సబ్ ఎంక్వైరీ కార్యాలయాల్లో విక్రయాలు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు.

ధర కాస్త ఎక్కువే..

మంచినీళ్లు కావాలంటే వెంటనే షాపుకి వెళ్లి 20రూపాయలతో వాటర్ బాటిల్ కొనుక్కుంటాం. నీళ్లు తాగి బాటిల్ అక్కడే పడేస్తాం. కానీ తిరుమలలో ఇలాంటి ప్లాస్టిక్ వ్యర్థాలతో పర్యావరణ కాలుష్యం ఏర్పడుతోంది. కొండ కోనల్లో వణ్యప్రాణులకు కూడా ఇది ఇబ్బందిగా మారింది. దీంతో టీటీడీ ఈ కఠిన నిబంధనలు అమలులోకి తెస్తోంది. 200 రూపాయలు, 450 రూపాయలతో బాటిల్స్ కొన్నవారు వాటిని జాగ్రత్తగా దాచుకుంటారు, తిరిగి వినియోగిస్తారు. ఒకరకంగా ఇది మంచి అలవాటే అని చెప్పాలి. అయితే ధర కాస్త ఎక్కువగా ఉండటంతో భక్తుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి. 

Tags:    
Advertisement

Similar News