అందుకే సంక్రాంతి పండుగకి ఊరికి వెళ్తున్నాను : సీఎం చంద్రబాబు
తెలుగు ప్రజలందరికీ ఏపీ సీఎం చంద్రబాబు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు.
ఈ సంక్రాంతి పండుగ తెలుగు ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు, ఆనందం నింపాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు చంద్రబాబు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సమయంలో ప్రతి ఒక్కరూ తమ ఊరు వెళ్లి నలుగురితో కలవటం అలవాటు చేసుకోవాలని అన్నారు. తాను అందుకే మా ఊరికి ప్రతీ సంక్రాంతికి వెళ్తున్నా అని చెప్పారు. సమాజంలో పై స్థాయిలో ఉన్నవారు దీనిని పాటిస్తే, మిగిలిన వారికి అది ప్రేరణగా ఉంటుందని అన్నారు. తాను మా ఊరు వెళ్లే సంప్రదాయానికి తన భార్య భువనేశ్వరినే కారణమని గుర్తుచేశారు.
పాతికేళ్ల క్రితం ఆమె పట్టుబట్టి మొదలు పెట్టిన ఈ సంప్రదాయాన్ని క్రమం తప్పకుండా పాటిస్తున్నామని చెప్పారు. మానవ సంబంధాలు తగ్గిపోతున్న ఈ రోజుల్లో ఒకచోట అంతా కలవటం, మాట్లాడుకోవడం ఎంతో అవసరమని తెలిపారు. మనం ఆనందంగా పండుగ చేసుకునేటప్పుడు.. ఆ ఊరిలో పేదవారు కూడా ఆనందంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. పేదవాడికి చేయూతనిచ్చి నిలబెట్టాల్సిన బాధ్యత మిగిలినవారిపై ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.ఈ విధానం ప్రోత్సహించడానికే పీ4 కాన్సెప్ట్ పేపర్‌ను ఆదివారం విడుదల చేస్తున్నాం. దీనిపై అన్ని స్థాయిల్లో చర్చ జరిగాక అమల్లోకి తెస్తాం’’ అని చంద్రబాబు తెలిపారు.