వైఎస్‌ బతికి ఉన్నా తెలంగాణ వచ్చేది

2014 కాదు తెలంగాణ 2009 లోనే రావాల్సి ఉండేదని ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Advertisement
Update:2025-01-13 18:22 IST

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి రాష్ట్ర విభజనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దివంగత సీఎం రాజశేఖరరెడ్డి బతికి ఉంటే రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదని చాలామంది అనుకుంటున్నారు. కానీ రాష్ట్ర విభజనకు వ్యతిరేకం కాదు అనే తీర్మానాన్ని రాజశేఖరరెడ్డి హయాంలోనే కాంగ్రెస్ అధిష్ఠానం పెట్టించాలని చూసిందని కిరణ్ కుమార్ రెడ్డి సంచలన విషయాన్ని వెల్లడించారు. రాజశేఖర్ రెడ్డి బతికున్నా తెలంగాణ ఏర్పాటు ఆగేది కాదన్నారు.2014 కాదు తెలంగాణ 2009 లోనే రావాల్సి ఉండేదన్నారు.

2009 ఎన్నికలకు ముందు తాను చీఫ్ విప్ గా ఉన్నప్పుడు రాజశేఖరరెడ్డి పిలిచి... 'మనం తెలంగాణ రాష్ట్రానికి అనుకూలం' అనే తీర్మానాన్ని అసెంబ్లీలో పెట్టాలని సూచించారు. ఎన్నికల ముందు మనం ఈ తీర్మానాన్ని పెడితే మనం ఓడిపోతామని ఆయనతో తాను చెప్పాను. అయితే 'నా చేతుల్లో ఏమీ లేదు. అది పై నుంచి వచ్చిన ఆర్డర్‌ అని, తపపక పాటించాలి. ప్రణబ్ ముఖర్జీ పంపారని చెప్పారన్నారు. ఆయన తనతో అన్నారని చెప్పారు. దీంతో తాము ప్రణబ్ ముఖర్జీతో మాట్లాడమని రిక్వెస్ట్‌ చేశామన్నారు. 'మేము తెలంగాణకు అనుకూలం' అనే తీర్మానాన్ని 'మేము తెలంగాణకు వ్యతిరేకం కాదు' అని మార్చామని వెల్లడించారు. తెలంగాణ ఏర్పాటును అడ్డుకోలేకపోయాన్న అపప్రధ తనపై సరికాదన్నారు. వైఎస్‌ ఉన్నా అడ్డుకోలేకపోయేవారని అన్నారు. రాష్ట్ర విభజన జరగదనే తాము అనుకున్నామని... దురదృష్టవశాత్తు రాష్ట్రం విడిపోయిందని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. వైఎస్ ఉన్నా విభజన ఆగేది కాదని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News