హత్యాయత్నం కేసులో టీటీడీ డిప్యూటీ ఈఈ అరెస్ట్
వెంకట శివారెడ్డిపై దాడికి పాల్పడ్డ ఇద్దరు వ్యక్తులతో పాటు టీటీడీ డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మి, ఆమె భర్త గిరీష్ చంద్రారెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు.
తిరుపతి నగరంలో సంచలనం రేపిన హత్యాయత్నం కేసులో టీటీడీ డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మితో పాటు మరో ముగ్గురిని అలిపిరి పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో శ్రీలక్ష్మితో పాటు ఆమె భర్త గిరీష్ చంద్రారెడ్డి, మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి నగరంలోని ఎన్జీవో కాలనీలో ఈ నెల 25న వెంకట శివారెడ్డి అనే వ్యక్తిపై హత్యయత్నం జరిగింది. ఆయన నివాసం ఉన్నచోటే ఇద్దరు దుండగులు ఆయనపై కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన వెంకట శివారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆయన పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. శివారెడ్డి వాంగ్మూలం ఇవ్వలేని పరిస్థితిలో ఉండడంతో అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలిలో సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించగా వెంకట శివారెడ్డిని అతడి అపార్ట్‌మెంట్ ముందే ఇద్దరు వ్యక్తులు అడ్డగించి కత్తితో తలపై పలుమార్లు నరికినట్లు కనిపించింది. అయితే దాడిలో పాల్గొన్న వారి ముఖాలు స్పష్టంగా కనిపించలేదు. పోలీసులు చేపట్టిన విచారణలో వెంకట శివారెడ్డికి అపార్ట్‌మెంట్‌లో ఎదురుగా నివాసం ఉన్న టీటీడీ డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మి కుటుంబానికి మధ్య విభేదాలు ఉన్నట్లు తేలింది.
శ్రీలక్ష్మి కుటుంబం, వెంకట శివారెడ్డి కుటుంబం పలుమార్లు గొడవ పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే వెంకట శివారెడ్డిని హత్య చేయాలని నిర్ణయించుకున్న శ్రీలక్ష్మి దంపతులు సుపారీ గ్యాంగ్‌తో హత్యకు ప్రయత్నించినట్లు పోలీసులు నిర్ధారించారు. వెంకట శివారెడ్డిపై దాడికి పాల్పడ్డ ఇద్దరు వ్యక్తులతో పాటు టీటీడీ డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మి, ఆమె భర్త గిరీష్ చంద్రారెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని కోర్టు ఎదుట హాజరు పరుచగా.. న్యాయస్థానం రిమాండ్ విధించింది.