ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ ర‌న్‌వేపై ట్ర‌య‌ల్ ర‌న్ స‌క్సెస్‌.. - ఇది ద‌క్షిణ భార‌త్‌లోనే తొలి ర‌న్‌వే

తొలిసారి నిర్వ‌హించిన ట్ర‌య‌ల్ ర‌న్‌లో ఎలాంటి ఇబ్బందీ ఎదురవ‌లేద‌ని వైమానిక ద‌ళ అధికారి ఆర్ఎస్ చౌద‌రి వెల్ల‌డించారు. ర‌న్‌వేకు ఇరువైపులా గేట్లు, ఫెన్సింగ్ పెట్టిన త‌ర్వాత విమానాల ల్యాండింగ్‌కి ఏర్పాట్లు చేస్తామ‌ని చెప్పారు.

Advertisement
Update:2022-12-30 08:06 IST

విమానాల ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ కోసం ఏర్పాటు చేసిన ర‌న్‌వేపై గురువారం నిర్వ‌హించిన తొలి ట్ర‌య‌ల్ ర‌న్ విజ‌య‌వంత‌మైంది. బాప‌ట్ల జిల్లా కొరిశ‌పాడు మండ‌లంలోని జాతీయ ర‌హ‌దారిపై ఈ ట్ర‌య‌ల్ ర‌న్ నిర్వ‌హించారు. బాప‌ట్ల జిల్లా పిచ్చ‌క‌ల‌గుడిపాడు - రేణింగ‌వ‌రం మ‌ధ్య 16వ నంబ‌ర్ జాతీయ ర‌హ‌దారిపై ఈ ర‌న్‌వేని నిర్మించారు. 4.1 కిలోమీట‌ర్ల పొడ‌వు, 33 మీట‌ర్ల వెడ‌ల్పుతో దీనిని ఏర్పాటు చేశారు. ఉద‌యం 10.51 గంట‌ల‌కు ప్రారంభ‌మైన ఈ ట్ర‌య‌ల్ ర‌న్ 45 నిమిషాల పాటు సాగింది. నాలుగు ఫైట‌ర్ ఎయిర్ క్రాఫ్ట్‌లు, ఒక కార్గో విమానం ఐదు అడుగుల ఎత్తులో ఈ ర‌న్‌వేపై తిరిగాయి. ఈ సంద‌ర్భంగా రాడార్ సిగ్న‌ల్స్‌తో పాటు ర‌న్‌వే ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్‌కి అనువుగా ఉందా లేదా అనే విష‌యాన్ని వైమానిక ద‌ళ అధికారులు ప‌రిశీలించారు. స‌ద‌ర‌న్ ఎయిర్ క‌మాండ్ నుంచి ఎప్ప‌టిక‌ప్పుడు సూచ‌న‌లు అందుకుంటూ ఈ ట్ర‌య‌ల్ ర‌న్ నిర్వ‌హించారు.

త్వ‌రలో విమానాల ల్యాండింగ్‌కి ఏర్పాట్లు..

తొలిసారి నిర్వ‌హించిన ట్ర‌య‌ల్ ర‌న్‌లో ఎలాంటి ఇబ్బందీ ఎదురవ‌లేద‌ని వైమానిక ద‌ళ అధికారి ఆర్ఎస్ చౌద‌రి వెల్ల‌డించారు. ర‌న్‌వేకు ఇరువైపులా గేట్లు, ఫెన్సింగ్ పెట్టిన త‌ర్వాత విమానాల ల్యాండింగ్‌కి ఏర్పాట్లు చేస్తామ‌ని చెప్పారు. త్వ‌ర‌లోనే ఈ ప్ర‌క్రియ పూర్తిచేస్తామ‌న్నారు. బాప‌ట్ల‌-నెల్లూరు జిల్లాల మ‌ధ్య‌ 16వ నంబ‌ర్ జాతీయ ర‌హ‌దారిపై రెండు ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీలు ఏర్పాటు చేస్తున్నామ‌ని చెప్పారు. ఈ ర‌న్‌వే ద‌క్షిణ భార‌త‌దేశంలోనే మొద‌టిద‌ని ఆయ‌న తెలిపారు. దేశంలో ఇది మూడోద‌ని చెప్పారు.

వ‌చ్చే ఏడాది ప్ర‌ధాని చేతుల‌మీదుగా..

వ‌చ్చే ఏడాది ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ చేతుల‌మీదుగా ఈ ర‌న్‌వేని ప్రారంభిస్తార‌ని చౌద‌రి తెలిపారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌లో ఇప్ప‌టికే రెండు ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీలు అందుబాటులోకి వ‌చ్చాయ‌ని వివ‌రించారు. ఏపీ, యూపీ, రాజ‌స్థాన్‌తో పాటు ప‌శ్చిమ‌బెంగాల్‌, త‌మిళ‌నాడు, ఒడిశా, జ‌మ్మూ క‌శ్మీర్‌ల‌లో కూడా ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ ర‌న్‌వేల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్టు తెలిపారు.

Tags:    
Advertisement

Similar News