తిరుమలలో నీటి కొరత.. టీటీడీ కీలక సూచన

నీటి ఎద్దడి కారణంగా ప్రైవేట్ గెస్ట్‌ హౌస్‌లకు నీటి సరఫరా నిలిపివేయాలని టీటీడీ అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Advertisement
Update:2024-08-22 20:13 IST

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. వర్షాభావ పరిస్థితులతో తిరుమలలోని డ్యామ్‌ల‌లో నీటి నిల్వలు గణనీయంగా తగ్గాయి. దీంతో భక్తులకు కీలక సూచనలు చేసింది టీటీడీ బోర్డు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతమున్న నీటి నిల్వలు 120 నుంచి 130 రోజుల వరకు మాత్రమే సరిపోతాయని స్పష్టం చేసింది.

తిరుమలలో సగటున రోజుకు 43 లక్షల గ్యాలన్ల నీటి వినియోగం ఉంటుంది. ఇందులో 18 లక్షల గ్యాలన్ల నీటిని తిరుమల డ్యామ్స్‌ నుంచి సేకరిస్తుండగా.. మిగతా వాటిని కల్యాణి డ్యామ్‌ నుంచి తీసుకుంటున్నారు. గోగర్భం, ఆకాశగంగ, పాపవినాశనం, పరుపుధార డ్యామ్‌లలో నీటి నిల్వ సామర్థ్యం మొత్తం 14 వేల 304 గ్యాలన్లుగా ఉంది. ప్రస్తుతం వీటిలో 5 వేల 800 గ్యాలన్ల నీరు అందుబాటులో ఉంది.




నీటి ఎద్దడి కారణంగా ప్రైవేట్ గెస్ట్‌ హౌస్‌లకు నీటి సరఫరా నిలిపివేయాలని టీటీడీ అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అవసరమైతే ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుక్కోవాలని ప్రైవేట్ గెస్ట్‌హౌస్‌ యజమాన్యాలకు అధికారులు సూచిస్తున్నారు. ఇక భక్తులు సైతం నీటి వినియోగం విషయంలో జాగ్రత్తలు పాటించాలని టీటీడీ సూచిస్తోంది.

దేశం మొత్తం వర్షాలు, వరదలతో తడిసి ముద్దవుతున్న వేళ తిరుమల పరిసర ప్రాంతాల్లో మాత్రం కరువు పరిస్థితులు నెలకొన్నాయి. తక్కువ వర్షపాతం కారణంగా తిరుమలలోని డ్యామ్‌లో నీటి నిల్వలు పూర్తిగా తగ్గిపోయాయి. అక్టోబర్‌ 4 నుంచి 12వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు ఉండడంతో నీటి విషయంలో టీటీడీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Tags:    
Advertisement

Similar News