తిరుమల ఘాట్ రోడ్ లో బస్సు ప్రమాదం.. స్తంభించిన ట్రాఫిక్

ఘాట్ రోడ్డులో ప్రమాదం జరగడంతో.. కొండ ఎక్కే వాహనాలన్నీ వెనకవైపు ఆగిపోయాయి. కొండను ఢీకొన్న బస్సు రోడ్డుపైనే నిలిచిపోయింది.

Advertisement
Update:2023-09-28 11:34 IST

ఇటీవల చిరుత పులుల ఘటనలతో వరుసగా తిరుమల వార్తలు కలకలం రేపాయి. ఇప్పుడు బస్సు ప్రమాదం మరోసారి తిరుమలను వార్తల్లో నిలిపింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఘాట్ రోడ్డులో ప్రమాదానికి గురైంది. దాదాపు 20మంది భక్తులు, టీటీడీ ఉద్యోగులకు గాయాలయ్యాయి. అతివేగమే ప్రమాదానికి కారణం అని తెలుస్తోంది.

రెండో ఘాట్ రోడ్డులో ప్రమాదం..

ఈ ఘటన జరిగిన ప్రదేశాన్ని చూస్తే పెను ప్రమాదం తప్పిందని అనుకోవాలి. రెండో ఘాట్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. నాలుగో కిలోమీటర్ మలుపు వద్ద బస్సు అదుపు తప్పి కొండను ఢీకొంది. డ్రైవర్ అతివేగం ఈ ప్రమాదానికి కారణం అంటున్నారు. కొండను ఢీకొన్ని బస్సు ఆగిపోయింది. ఒక్కసారిగా బస్సు కుదుపుకి లోను కావడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. గాయాలతో బయటపడినవారికి తోటి ప్రయాణికులు, పోలీసులు ఫస్ట్ ఎయిడ్ చేశారు. కొంతమందిని ఆస్పత్రికి తరలించారు.

స్తంభించిన ట్రాఫిక్..

ఘాట్ రోడ్డులో ప్రమాదం జరగడంతో.. కొండ ఎక్కే వాహనాలన్నీ వెనకవైపు ఆగిపోయాయి. కొండను ఢీకొన్న బస్సు రోడ్డుపైనే నిలిచిపోయింది. దాన్ని తప్పించుకుని వెళ్లేందుకు ఇతర పెద్ద వాహనాలకు వీలు లేదు. దీంతో కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఘటనా స్ధలానికి చేరుకు‌న్న పోలీసులు ట్రాఫిక్ క్రమబద్థీకరించారు. క్షతగాత్రులను తిరుమలలోని అశ్విని ఆస్పత్రికి తరలించారు. 

Tags:    
Advertisement

Similar News