విద్యుత్‌ షాక్‌తో ముగ్గురు స్నేహితుల సజీవదహనం.. ప్రకాశం జిల్లాలో విషాదం

గౌతమ్, నజీర్‌ పట్టణంలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతుండగా.. బాలాజీ చదువు ఆపేశాడు. వీరు ముగ్గురూ మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పునుగోడు చెరువులో సరదాగా ఈత కొట్టేందుకు స్కూటీపై బయల్దేరారు.

Advertisement
Update:2024-07-24 11:11 IST

ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. స్కూటీపై వెళుతున్న ముగ్గురు స్నేహితులు విద్యుత్‌ వైరు తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. మంగళవారం జరిగిన ఈ ఘటన వారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పునుగోడు వద్ద జరిగిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

కనిగిరిలోని ఇందిరా కాలనీకి చెందిన దేశబోయి నజీర్‌ (16), దేవాంగ నగర్‌కు చెందిన వీరమాస గౌతమ కుమార్‌ (16), కామినేని బాలాజీ (16) పదో తరగతి వరకు కలిసి చదువుకున్నారు. గౌతమ్, నజీర్‌ పట్టణంలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతుండగా.. బాలాజీ చదువు ఆపేశాడు. వీరు ముగ్గురూ మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పునుగోడు చెరువులో సరదాగా ఈత కొట్టేందుకు స్కూటీపై బయల్దేరారు.

వారు పునుగోడులోని ఎస్టీ కాలనీ సమీపంలోకి వచ్చేసరికి తెగి కిందకు వేలాడుతున్న విద్యుత్‌ తీగ వీరికి తగిలింది. దీంతో ఒక్కసారిగా షాక్‌ కొట్టి ముగ్గురూ కిందపడిపోయారు. అదే సమయంలో స్కూటీ నుంచి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురూ కాలిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. విద్యుత్‌ సిబ్బంది నిర్లక్ష్యమే తమ బిడ్డల ప్రాణాలు తీసిందని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News