ఏపీలో పొలిటికల్ డబుల్ గేమ్
తమ రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం నేతలు అధికారం ఉన్నచోటుకి వలసపోవడం చూశాం. ఈ స్ట్రాటజీ గతం, ప్రస్తుతం డబుల్ గేమ్ పాలిటిక్స్ ట్రెండ్ ఏపీలో నడుస్తోంది.
అన్నదమ్ములిద్దరూ ఒక ఇంట్లోనే ఉంటారు. కానీ వాళ్లిద్దరూ వేర్వేరు పార్టీలు. వాళ్లిద్దరూ తండ్రీకొడుకులు కానీ ఆయనదో పార్టీ, ఈయనదో పార్టీ. వాళ్లిద్దరూ భార్యాభర్తలు.. భార్య బీజేపీ, భర్త వైసీపీ. మామ వైసీపీ ఎమ్మెల్యే, అల్లుడు టిడిపి ఇన్‌చార్జి ఇది మరో కథ. ఈ పొలిటికల్ డబుల్ గేమ్ ఆంధ్రప్రదేశ్‌లో మహారంజుగా సాగుతోంది. ఈ ఫ్యామిలీ పాలిట్రిక్స్ చూస్తున్న కేడర్ తీవ్ర ఆందోళనకి గురవుతున్నారు.
రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి వైసీపీ. ఆయన సోదరుడు విజయశేఖర్ రెడ్డి చంద్రబాబును కలిశారు. తనకు టీడీపీపై ఆసక్తి ఉందని.. అవకాశం ఇస్తే రాజంపేట నుంచి పోటీ చేస్తానని తన మనసులో మాటను చంద్రబాబుతో చెప్పి టిడిపిలో చేరారు.
కర్నూలు టిడిపి ఇన్‌చార్జి టిజి భరత్ కాగా తండ్రి టిజి వెంకటేశ్ బీజేపీకి కీలక నేత. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటారు. కానీ పార్టీలు వేరు.
వైకాపా టికెట్‌పై పర్చూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. అనంతరం పార్టీకి దూరం అయ్యారు. ఏ పార్టీలోనూ తాను లేనంటున్నారు. ఆయన సతీమణి పురందేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు.
బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వైసీపీ కీలక నేత. అల్లుడు భూమా బ్రహ్మానందరెడ్డి నంద్యాల టిడిపి ఇన్‌చార్జి. మామా అల్లుళ్ల మధ్య మంచి ఆప్యాయతానుబంధాలున్నాయి. కానీ ఇద్దరూ వేరు వేరు పార్టీల నుంచి వేర్వేరు నియోజకవర్గాల బాధ్యతలు చూస్తుంటారు.
జమ్మలమడుగు ఆదినారాయణరెడ్డి బీజేపీలో ఉన్నారు. ఆయన అన్న కొడుకు భూపేష్ రెడ్డి జమ్మలమడుగు నియోజకవర్గం టిడిపి ఇన్‌చార్జి. బాబాయ్ కమలదళంలో ఉంటే.. అబ్బాయ్ పసుపు సైన్యంలో ఉన్నాడు.
తమ రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం నేతలు అధికారం ఉన్నచోటుకి వలసపోవడం చూశాం. ఈ స్ట్రాటజీ గతం, ప్రస్తుతం తండ్రి ఒక పార్టీలో..కొడుకు మరో పార్టీలో ఉండే డబుల్ గేమ్ పాలిటిక్స్ ట్రెండ్ ఏపీలో నడుస్తోంది.