అద్దె చెల్లించడం లేదని సామగ్రికి నిప్పు.. మంటలు అంటుకొని యజమాని మృతి
అనుకున్నదే తడవుగా ఆదివారం వేకువజామున 5.30 గంటల సమయంలో షాపు దగ్గరకు వెళ్లాడు. తాళం కూడా లేకపోవడంతో షట్టర్ తెరిచి.. లోపలి షామియానా సామగ్రిపై పెట్రోలు పోసి నిప్పంటించాడు.
షాపును అద్దెకు తీసుకున్న వ్యక్తి ఏళ్ల తరబడి అద్దె చెల్లించడం లేదనే కోపంతో షాపు యజమాని అందులోని సామగ్రికి నిప్పంటించాడు. ఈ ఘటనలో ప్రమాదవశాత్తూ యజమానికి మంటలు అంటుకొని ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం జరిగిన ఈ ఘటన అతని కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రకాశం జిల్లా దర్శిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎస్ఐ రామకృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
పట్టణంలోని కోతమిషన్ బజారులో నివసిస్తూ, కురిచేడు రోడ్డులో బంగారం దుకాణం నిర్వహిస్తున్న పోతంశెట్టి వరప్రసాద్ (45)కు అదే ప్రాంతంలో మరో షాపు కూడా ఉంది. దానిని ఆవుల శ్రీనివాసులు అనే వ్యక్తికి టెంట్‌హౌస్ పెట్టుకునేందుకు అద్దెకు ఇచ్చాడు. శ్రీనివాసులు 2020 నుంచి షాపు అద్దె చెల్లించడం లేదు. దీనిపై అడిగితే సక్రమంగా సమాధానం చెప్పడం లేదని యజమాని వరప్రసాద్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడు. ఈ క్రమంలోనే షాపులోని షామియానా సామగ్రికి నిప్పు పెట్టాలని నిర్ణయించుకున్నాడు.
అనుకున్నదే తడవుగా ఆదివారం వేకువజామున 5.30 గంటల సమయంలో షాపు దగ్గరకు వెళ్లాడు. తాళం కూడా లేకపోవడంతో షట్టర్ తెరిచి.. లోపలి షామియానా సామగ్రిపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఆ మంటలు ఒక్కసారిగా చెలరేగి అతనికీ అంటుకోవడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు గమనించి వెంటనే వరప్రసాద్‌ను బయటికి తీసుకొచ్చారు. అప్పటికే 80 శాతం కాలిపోయిన అతన్ని 108 సిబ్బంది తొలుత దర్శి ఆస్పత్రికి, అక్కడి నుంచి ఒంగోలు రిమ్స్‌కి తరలించారు. అయితే అప్పటికే అతను మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు..
వరప్రసాద్‌కు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొడుకు గుంటూరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నాడు. ఓ కుమార్తెకు ఆదివారం గుంటూరులో పరీక్ష ఉండగా, కుమారుడిని కూడా చూసేందుకు కలిసి వెళ్లాలని అతను, అతని భార్య ఉమాదేవి అనుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున తన ఆరోగ్యం బాగాలేదని, మాత్రలు తెచ్చుకుంటానని బయటకు వెళ్లిన వరప్రసాద్ రావడం ఆలస్యమవుతుందని భావించిన ఉమాదేవి.. కుమార్తెతో సహా ముందుగా వెళ్తున్నానని, డ్రైవర్‌ను తీసుకుని తర్వాత కారులో గుంటూరు రావాలని చెప్పి బయల్దేరారు. ఆమె దారిలో ఉండగానే భర్త చనిపోయిన సంగతి తెలిసి, ఒంగోలు రిమ్స్ వద్దకు చేరుకొని భర్త మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు.