రామోజీ అయినా.. ఆదిరెడ్డయినా ఒకటే పాటా..?
ఎమ్మెల్సీగా పనిచేసిన ఆదిరెడ్డి అప్పారావును అరెస్టు చేస్తావా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేస్తున్న వ్యాపారాల్లో అక్రమాలగురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేదు.
మార్గదర్శి చిట్ ఫండ్ అయినా.. జగజ్జనని చిట్స్ అయినా తెలుగుదేశం పార్టీ నేతలు ఒకటే పాట పాడుతున్నారు. అదేమిటంటే.. జగన్మోహన్ రెడ్డి టీడీపీ నేతలను వేధిస్తున్నారని. టీడీపీ వాళ్ళు వ్యాపారాలు చేసుకోకూడదా..? అంటూ నిలదీస్తున్నారు. చేస్తున్న వ్యాపారాల్లో అక్రమాలు, అవినీతి జరిగిందా..? లేదా..? అంటే మళ్ళీ ఆ విషయాన్ని ఎవరూ మాట్లాడరు. ఇప్పుడు విషయం ఏమిటంటే.. రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త శ్రీనివాస్, మామ ఆదిరెడ్డి అప్పారావు నడుపుతున్న జగజ్జనని చిట్ ఫండ్ కంపెనీలో అక్రమాలు జరిగాయట.
జిల్లా రిజిస్ట్రార్ ఫిర్యాదు చేయగానే సీఐడీ అధికారులు రంగంలోకి దిగారు. రికార్డులను పరిశీలించి తమకు అందిన ఫిర్యాదులు నిజమే అని నిర్ధారణ చేసుకున్నారు. మూడురోజుల క్రితం వారి ఇంటికి వెళ్ళి తండ్రి, కొడుకులిద్దరినీ అరెస్టు చేశారు. తర్వాత కోర్టులో ప్రవేశపెట్టి 14 రోజుల రిమాండుకు పంపారు. అందుబాటులోని సమాచారం ప్రకారం ఇప్పటికి చిట్‌ఫండ్స్ నుంచి రూ. 15 కోట్లను ఇతర వ్యాపారాలకు మళ్ళించటమే కాకుండా పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు సీఐడీ దగ్గర ఆధారాలున్నాయట.
సీన్ కట్ చేస్తే మూడురోజుల నుండి చంద్రబాబునాయుడు దగ్గర నుండి కిందిస్థాయి నేతల వరకు ఒకటే గోలచేస్తున్నారు. మాజీ మంత్రులు బండారు సత్యనారాయణమూర్తి, దేవినేని ఉమ, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. బండారైతే జగన్ పై బూతుల వర్షం కురిపించారు. బీసీలను అణగదొక్కుతున్నారని మండిపడ్డారు. బీసీలు వ్యాపారాలు చేసుకుంటే జగన్ కు కడుపుమంట ఎందుకంటూ రెచ్చిపోయారు. నా కొడకా.. అరేయ్.. ఒరేయ్ అంటూ చెలరేగిపోయారు.
ఎమ్మెల్సీగా పనిచేసిన ఆదిరెడ్డి అప్పారావును అరెస్టు చేస్తావా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేస్తున్న వ్యాపారాల్లో అక్రమాలగురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేదు. మార్గదర్శి విషయంలో రామోజీరావుపై సీఐడీ కేసులుపెట్టినప్పుడు కూడా ఇలాగే తమ్ముళ్ళు రెచ్చిపోయారు. రామోజీ అయినా ఆదిరెడ్డి అయినా వ్యాపారాల్లో అక్రమాలు చేసినా అడక్కూడదని చంద్రబాబు చెబుతున్నారు. వ్యాపారాల ముసుగులో టీడీపీ వాళ్ళు ఏమైనా చేయవచ్చు కానీ ప్రభుత్వం ప్రశ్నిస్తే మాత్రం వేధింపులని, కక్షసాధింపులని గోలగోల చేసేస్తున్నారు.