వైసీపీలో టెన్షన్ మొదలైందా?

తన కేసు విచారణ మాత్రం వెంటనే జరగాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కోరుకోవటంలేదు.. జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపును రద్దు చేయాలని, బెయిల్ రద్దు చేసి వెంటనే అరెస్టు చేయాలని మాత్రం పోరాటం చేస్తున్నారు.

Advertisement
Update:2023-11-23 10:00 IST

వైసీపీలో టెన్షన్ మొదలైనట్లే ఉంది. అక్రమాస్తుల కేసుల విచారణ నుండి జగన్మోహన్ రెడ్డికి మినహాయింపు ఇచ్చిన విషయమై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరగబోతోంది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. కేసుల విచారణ హైకోర్టు, సీబీఐ కోర్టు, సుప్రీంకోర్టుల్లో జరుగుతోంది. సంవత్సరాల తరబడి జరుగుతున్న విచారణలో ఏ కోర్టులో ఏ కేసు విచారణ జరుగుతోందని అడిగితే ఎవరూ చెప్పలేరు. పోనీ ఏ కేసు విచారణ ఎక్కడిదాకా వచ్చిందో చెప్పమని అడిగినా చెప్పలేరు.

కేసుల విచారణ అంత నత్తనడకతో నడుస్తోంది. కేసుల విచారణను స్పీడ్‌ చేయాలని గతంలో స్వయంగా జగనే కోర్టుకు లేఖ రాసిన విషయం తెలిసిందే. సరే ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే ప్రతిపక్షంలో ఉండగా ప్రతి శుక్రవారం రెగ్యులర్‌గా కోర్టు విచారణకు హాజరయ్యేవారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత విచారణలో వ్యక్తిగత మినహాయింపు అడిగితే హైకోర్టు అనుమతించింది. దాన్ని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తీవ్రంగా వ్యతిరేకిస్తు సుప్రీంకోర్టులో కేసు వేశారు.

ఇప్పుడు ఆ పిటీషన్‌పైనే సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరగబోతోంది. తన పిటీషన్‌లో ఎంపీ అనేక ఆరోపణలు చేశారు. అయితే చాలా వాటికి పెద్దగా విలువలేదు. జగన్ రూ.40 వేల కోట్లు దోచుకున్నట్లు ఆరోపించారు. అయితే అందుకు ఆధారాలను మాత్రం ఎక్కడా చూపలేదు. ఏ కోర్టు కూడా జగన్ రూ.40 వేల కోట్లు దోచుకున్నట్లు నిర్ధారించలేదు. కేసులను విచారించిన సీబీఐ అధికారి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. జగన్ అక్రమాస్తుల ఆరోపణల విలువ కేవలం రూ. 800 కోట్లు మాత్రమే అన్నారు. వేల కోట్లు దోచుకున్నాడన్నది రాజకీయంగా చేస్తున్న ఆరోపణలు మాత్రమే అని కొట్టిపారేశారు.

విచిత్రం ఏమిటంటే ఎంపీ కూడా వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని బ్యాంకుల నుండి దోచుకున్నాడన్న విచారణ కోర్టులో జరుగుతోంది. ఎంపీ దోపిడీని సీబీఐ ఆధారాలతో సహా కోర్టులో సబ్మిట్ చేసింది. తన కేసు విచారణ మాత్రం వెంటనే జరగాలని ఎంపీ కోరుకోవటంలేదు.. జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపును రద్దు చేయాలని, బెయిల్ రద్దు చేసి వెంటనే అరెస్టు చేయాలని మాత్రం పోరాటం చేస్తున్నారు. మరి రేపు విచారణలో సుప్రీంకోర్టు ఏం చెబుతుందో చూడాలి.


Tags:    
Advertisement

Similar News