పవన్ తో మీటింగ్.. అరవింద్ పై ట్రోలింగ్
డిప్యూటీ సీఎం పవన్ ను సినీ పరిశ్రమ తరపున అభినందించడం కోసం తాము వచ్చామని తెలిపారు నిర్మాత అల్లు అరవింద్.
తెలుగు సినిమా నిర్మాతలు ఈరోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ నుంచి వచ్చిన వారంతా విజయవాడలోని పవన్ కార్యాలయానికి చేరుకుని ఆయనతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా ఉన్నారు. ఏపీ సినీరంగ సమస్యలను వారికి నిర్మాతలు విన్నవించారు. నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వనీదత్, సురేష్ బాబు, ఏఎం రత్నం, దిల్ రాజు తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.
త్వరలో సీఎంతో భేటీ..
డిప్యూటీ సీఎం పవన్ ను సినీ పరిశ్రమ తరపున అభినందించడం కోసం తాము వచ్చామని తెలిపారు నిర్మాత అల్లు అరవింద్. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన త్వరలో సీఎం చంద్రబాబుని కూడా కలుస్తామన్నారు. ఆయన అపాయింట్ మెంట్ ఇప్పించాలని పవన్ ని కోరినట్టు తెలిపారు. అన్ని అసోసియేషన్లు కలసి వచ్చి సీఎంని అభినందిస్తామని చెప్పారు. సినీ పరిశ్రమకు సంబంధించి సమస్యలపై కూడా సీఎంతో చర్చిస్తామన్నారు. పరిశ్రమకు చాలా సమస్యలున్నాయని, సినిమా టికెట్ల రేట్ల పెంపు అనేది చాలా చిన్న విషయం అని వివరించారు. సీఎంను కలిసినప్పుడు అన్ని విషయాలు ఆయనకు వివరిస్తామన్నారు అరవింద్.
అరవింద్ పై ట్రోలింగ్..
ఎన్నికల వేళ అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్, కూటమికి వ్యతిరేకంగా అంటే.. వైసీపీకి మద్దతుగా ప్రచారం చేశారు. కేవలం నంద్యాల వరకే ఆ ప్రచారం పరిమితం అయినా సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి మధ్య దూరం పెరిగేలా కథనాలు వచ్చాయి. ఆ తర్వాత నాగబాబు "మా వాడు పరాయివాడు" అంటూ ట్వీట్ వేయడం, డిలీట్ చేయడం కూడా వివాదాస్పదమైంది. చివరకు ఎన్నికల్లో కూటమి విజయం తర్వాత అల్లు అర్జున్ పై ట్రోలింగ్ మొదలైంది. ఇప్పుడు అల్లు అరవింద్ పవన్ ని కలిసేందుకు రావడంతో మళ్లీ విమర్శలు వినపడుతున్నాయి.
అల్లు అర్జున్ పవన్ వ్యతిరేక పార్టీకి ప్రచారం చేస్తారని, ఆయన తండ్రి పవన్ ని కలసేందుకు ఎందుకు వచ్చారని కొంతమంది నెటిజన్లు నిలదీస్తున్నారు. మెగా ఫ్యామిలీ అంతా పవన్ తరపున ప్రచారం చేయగా, అల్లు అర్జున్ ఒక్కరే స్నేహితుడికోసం అంటూ నంద్యాలకు వెళ్లి ఇప్పుడు సోషల్ మీడియాలో జనసైనికులకు టార్గెట్ అయ్యారు.