మనిషి కాంగ్రెస్‌లో.. మనసు మాత్రం టీడీపీలో..!
ఆంధ్రప్రదేశ్ పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని నిన్న రేణుకా చౌదరి చేసిన కామెంట్లు వైరలయ్యాయి. సీఎం జగన్ అవినీతి కేసుల్లో బెయిల్‌పై బయటికొచ్చి నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని రేణుక మండిపడ్డారు.
కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ రేణుకాచౌదరి వయసుమీద పడుతున్నా.. ఆమె స్వరంలో అదే దూకుడు. అనుకున్న విషయాన్ని ఎంత గట్టిగా చెప్పాలో అంతకంటే గట్టిగా చెప్పగల సమర్ధురాలు. కాంగ్రెస్ పీక్స్‌లో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిన ఆమె ఎన్నికలప్పుడు మాత్రం చాలా యాక్టివ్ అయిపోతారు. తనవాళ్లకు టికెట్లివ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తారు. అయితే ఆమె ఖమ్మంలో ఉన్నా.. హైదరాబాద్‌లో ఉన్నా.. ఆఖరికి ఢిల్లీలో ఉన్నా రేణుకాచౌదరి మనసు మాత్రం ఏపీ రాజకీయాల చుట్టూ, మరీ ముఖ్యంగా తన మాతృ పార్టీ తెలుగుదేశం వైపు తిరుగుతూనే ఉంటుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
పిచ్చోడి చేతిలో రాయిలా ఏపీ పరిస్థితి..
ఆంధ్రప్రదేశ్ పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని నిన్న రేణుకా చౌదరి చేసిన కామెంట్లు వైరలయ్యాయి. సీఎం జగన్ అవినీతి కేసుల్లో బెయిల్‌పై బయటికొచ్చి నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని రేణుక మండిపడ్డారు. ఆయన బెయిల్ రద్దు చేయాలని కూడా డిమాండ్ చేశారు. చంద్రబాబును స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అన్యాయంగా అరెస్టు చేశారని తెగ బాధపడ్డారు.
అమరావతిపైనా అదే ప్రేమ
ఇప్పుడేకాదు అమరావతి రాజధాని రైతుల పోరాటంలోనూ రేణుక మద్దతుగా నిలబడుతున్నారు. అమరావతి రైతుల ఉద్యమంలో పాల్గొని సంఘీభావం చెప్పడమే కాదు వారిని ప్రభుత్వం అన్యాయం చేసిందని గట్టిగా మాట్లాడుతున్నారు కూడా. రైతుబిడ్డనని, రైతులకు అన్యాయం జరిగింది కాబట్టి తానొచ్చానని చెబుతున్నారు.
మిగతా తెలంగాణ నేతలకంటే డిఫరెంట్
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ నేతలు ఏపీ రాజకీయాలను నిశితంగా గమనిస్తున్నారు. కానీ, ఎక్కడా తొందరపడి కామెంట్ చేయడం లేదు. ఏపీ రాజకీయాల్లో ఒక పార్టీని సపోర్ట్ చేసినట్లు మాట్లాడినా తెలంగాణ సమాజంలో మనమీద ప్రభావం పడుతుందేమోననే భయంతో అన్ని పార్టీల నాయకులూ ఆచితూచి మాట్లాడుతున్నారు. కానీ, రేణుకా చౌదరి మాత్రం తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టేసినట్లు చెబుతుండటం చూసి ఆమె తాను రాజకీయ ఓనమాలు దిద్దిన తెలుగుదేశం పార్టీని మాత్రం మరిచిపోలేదని కామెంట్స్ వస్తున్నాయి.