టెక్కలి ఎస్సైపై వేటు.. వైసీపీకి చేటు చేసేనా..?
ఎస్సైపై చర్యలు తీసుకోవద్దని ఎవరూ చెప్పడంలేదు కానీ, కనీసం రాజకీయ నాయకుల ఓవర్ యాక్షన్ ని కూడా అధిష్టానం దృష్టిలో ఉంచుకోవాలి కదా. అంటే ఇలాంటి పార్టీలకు, పబ్లిక్ ప్లేస్ లో నాయకులు రికార్డింగ్ డ్యాన్స్ లు ఏర్పాటు చేయడాన్ని పార్టీ అధిష్టానం సమర్థిస్తుందా..?
అశ్లీల నృత్యాలు, రికార్డింగ్ డ్యాన్స్ లు, అర్థరాత్రి వరకు గానా బజానా, రోడ్డుని బ్లాక్ చేసి డ్యాన్స్ లు.. ఇవీ ఇటీవల టెక్కలిలో జరిగిన వ్యవహారం. ఈ స్టేజ్ పర్ఫామెన్స్ లో ఎస్సై హరికృష్ణ కాస్త హుషారవడం, స్టేజ్ పై అమ్మాయిలతో డ్యాన్స్ చేయడంతో ఆయనపై వేటు వేశారు, వీఆర్ కి పంపించారు. పోనీ ఆ డ్యాన్స్ లు తప్పే అయితే కేవలం ఎస్సైపై చర్యలు తీసుకోవడంతోనే సరిపెడతారా..? సాక్షాత్తూ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అభ్యర్థిగా నేరుగా సీఎం జగన్ ప్రకటించిన దువ్వాడ శ్రీనివాస్ సమక్షంలోనే ఆయన పుట్టినరోజు వేడుకల్లో అశ్లీల నృత్యాలు వేశారు. మరి ఆయనపై చర్యలేం లేవా..? ఈ ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. టీడీపీ అనుబంధ విభాగాలన్నీ వైసీపీపై విరుచుకుపడుతున్నాయి.
పోలీసుల్ని బలిపశువులు చేస్తారా..?
వాస్తవానికి ఇదంతా గుట్టుగా సాగాల్సిన వ్యవహారం. కానీ పొరపాటో, గ్రహపాటో వీడియో బయటకొచ్చింది, అందులో ఎస్సై ఒళ్లు మరిచి చిందులేశారు. దీంతో బర్త్ డే పార్టీ, రికార్డింగ్ డ్యాన్స్ వ్యవహారం రచ్చకెక్కింది. అసలే ఎమ్మెల్సీ, ఆపై ఆయనకు ఎమ్మెల్యే సీటు కూడా ఖరారైంది, వైరి వర్గాలను ఒక్కటి చేసి సీఎం జగన్ నేరుగా ఆయనకు టికెట్ ప్రకటించారు. దీంతో ఆయన అనుచరులు మరింత ఉత్సాహంతో బర్త్ డే పార్టీ అరేంజ్ చేశారు. ఆ పార్టీకి ఆయన కూడా వచ్చారు. మరి ఆయన ముందే డ్యాన్స్ లు చేసినా ఆయన ఎందుకు వారించలేదు, ఎస్సై స్టేజ్ ఎక్కి రచ్చ చేసినా కూడా ఆయన సైలెంట్ గా ఎందుకున్నారు.. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎస్సై ఒక్కడిపై చర్యలు తీసుకోవడం ఏంటి..?
నాయకులు తప్పు చేస్తే వదిలేస్తున్నారని, అదే సమయంలో ఉద్యోగులు తప్పు చేస్తే మాత్రం వెంటనే చర్యలు తీసుకుంటున్నారనే సంకేతాలు జనంలోకి వెళ్తున్నాయని తేలిపోయింది. ఈ ఘటనలో దువ్వాడకు అధిష్టానం వార్నింగ్ ఇవ్వలేదు. అదే సమయంలో ఎస్సైపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఇదెక్కడి వివక్ష. ఎస్సైపై చర్యలు తీసుకోవద్దని ఎవరూ చెప్పడంలేదు కానీ, కనీసం రాజకీయ నాయకుల ఓవర్ యాక్షన్ ని కూడా అధిష్టానం దృష్టిలో ఉంచుకోవాలి కదా. అంటే ఇలాంటి పార్టీలకు, పబ్లిక్ ప్లేస్ లో నాయకులు రికార్డింగ్ డ్యాన్స్ లు ఏర్పాటు చేయడాన్ని పార్టీ అధిష్టానం సమర్థిస్తుందా..? ఇటీవల పవన్ కల్యాణ్ వ్యవహారంలో ఆడవారిని అవమానిస్తారా, ఆటబొమ్మలుగా చూస్తారా అంటూ నోటీసులు పంపినవారు, ఇలాంటి ఘటనలపై ఎలా స్పందిస్తారంటూ సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ముఖ్యంగా దువ్వాడ శ్రీనివాస్ ని తప్పించేందుకే ఈ ఘటనలో ఎస్సైపై వేటు వేశారనే ప్రచారం జరుగుతోంది.