మాధవ్ వీడియో వ్యవహారంలో గవర్నర్ బాధపడ్డారు..!

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారాన్ని టీడీపీ వదిలేలా లేదు. ఈ వీడియో విషయంలో తప్పంతా టీడీపీపై నెట్టే ప్రయత్నం జరగడంతో.. ఆ పార్టీ కూడా దీన్ని సీరియస్ గా తీసుకుంది.

Advertisement
Update:2022-08-13 07:40 IST

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారాన్ని టీడీపీ వదిలేలా లేదు. ఈ వీడియో విషయంలో తప్పంతా టీడీపీపై నెట్టే ప్రయత్నం జరగడంతో.. ఆ పార్టీ కూడా దీన్ని సీరియస్ గా తీసుకుంది. టీడీపీ మహిళా జేఏసీ నేతలు నేరుగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసి ఎంపీపై ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ మాధవ్ వీడియో వ్యవహారంపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని, పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోయిందని చెప్పారు. మాధవ్ ముమ్మాటికీ తప్పు చేశారని, ఇంకా చేస్తూనే ఉన్నారని అన్నారు తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత. తప్పు చేసిందే కాక, కెమెరాల ముందుకొచ్చి ఛాలెంజ్ విసురుతున్నారని మండిపడ్డారు.

డర్టీ ఎంపీని సేవ్ చేస్తారా..?

గోరంట్ల మాధవ్ ని డర్టీ ఎంపీ అంటూ ఘాటు పదాలు వాడారు వంగలపూడి అనిత. ఆయన్ను సేవ్ చేయడానికి ప్రభుత్వం, పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. మాధవ్ వీడియో వ్యవహారంలో గవర్నర్ కూడా బాధపడ్డారని చెప్పారామె. అనంతపురం ఎస్పీ ఫకీరప్ప శాటిలైట్ టెక్నిక్ ద్వారా క్రిమినల్స్‌ ను పట్టుకోవటంలో సిద్ధహస్తుడని పేరు తెచ్చుకున్నారని, అలాంటి వ్యక్తి ఒరిజినల్ వీడియో ఉంటేనే కాని ఈ కేసులో ముందుకు పోలేమని చెప్పడం అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. ప్రభుత్వ పెద్దల చేతిలో ఎస్పీ ఫకీరప్ప కీలుబొమ్మగా మారిపోయారని విమర్శించారు.

ఢిల్లీకి వెళ్తాం..

ఈ వ్యవహరాన్ని ఇక్కడితో వదిలిపెట్టేది లేదని, త్వరలో మాధవ్ వీడియో వ్యవహారం తేల్చేందుకు ఢిల్లీ వెళ్తామని చెబుతున్నారు టీడీపీ మహిళా జేఏసీ నేతలు. లోక్ సభ స్పీకర్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ కు మాధవ్ వీడియో వ్యవహారంపై ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఎంపీ మాధవ్ బర్తరఫ్ అయ్యే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు మహిళా నేతలు. ఇప్పటికే ఈ వ్యవహారంలో జాతీయ మహిళా కమిషన్ కి ఫిర్యాదులు వెళ్లాయి, మహిళా కమిషన్ కూడా లోక్ సభ స్పీకర్ కు లేఖ రాసింది. ఇప్పుడు నేరుగా మహిళలే ఢిల్లీకి వెళ్లి ఈ విషయంపై వ్యక్తిగతంగా ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News