ఆక్రమణలు వదిలేయాలా..? జగన్ ట్వీట్ కు టీడీపీ కౌంటర్
"అంత పెద్ద పెద్ద డైలాగులు వద్దులే కానీ, ముందు అసెంబ్లీకి వచ్చి పోరాడు." అంటూ టీడీపీ నుంచి ట్వీట్ పడింది.
ఈ బెదిరింపులు, ఈ కక్షసాధింపులకు వైసీపీ తలొగ్గేది లేదు, వెన్నుచూపేది అంతకన్నా లేదంటూ పార్టీ ఆఫీస్ కూల్చివేత ఘటనపై జగన్ స్పందించిన విషయం తెలిసిందే. ఈ రియాక్షన్ కు వెంటనే టీడీపీ కౌంటర్లు మొదలు పెట్టింది. కబ్జా చేసిన స్థలంలో పార్టీ ఆఫీస్ కడుతున్న జగన్ కి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదన్నది. "ప్రజల తాగునీటి అవసరాలకు ఉపయోగపడే వాటర్ ప్లాంట్ కట్టకుండా, మత్స్యకారుల భూమి ఆక్రమించి, కబ్జా చేసి కట్టామని, సిగ్గు వదిలేసి చెప్తున్నారు. నీ కబ్జాలు, నీ ఆక్రమణలు, నీ విలాసవంతమైన ప్యాలెస్‌లు వదిలేయమంటావా ? ఇంత పెద్ద పెద్ద డైలాగులు వద్దులే కానీ, ముందు అసెంబ్లీకి వచ్చి పోరాడు." అంటూ టీడీపీ నుంచి ట్వీట్ పడింది.
దాదాపు పూర్తి కావొచ్చిన వైసీపీ కార్యాలయం అంటూ జగన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. అది కేవలం నిర్మాణంలో ఉన్న కార్యాలయం అంటూ టీడీపీ అనుకూల మీడియా చెబుతూ వస్తోంది. అక్కడున్న సీన్ చూస్తే.. కేవలం పిల్లర్లు మాత్రమే పైకి లేచాయి. శ్లాబ్ ఇంకా పడలేదు. సోషల్ మీడియా మాత్రం ఈ ఘటనపై భిన్నంగా స్పందిస్తోంది. గతంలో ప్రజా వేదిక కూల్చేశారని, ఇప్పుడు పార్టీ ఆఫీస్ కూల్చేస్తే ఎందుకు గోల చేస్తున్నారని ఓ వర్గం వాదిస్తోంది. మరో వర్గం మాత్రం కూల్చివేతలు సరికాదంటోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
విశాఖలో కూడా..
విశాఖపట్నం పరిధిలోని ఎండాడ, అనకాపల్లి జిల్లాలోని రాజుపాలెం గ్రామాల్లో కూడా వైసీపీ కార్యాలయాలపై ఆరోపణలు వినపడుతున్నాయి. అక్కడ కార్యాలయాల నిర్మాణం పూర్తయింది. అయితే వాటికి అనుమతులు లేవని, అనకాపల్లి జిల్లాలో కాపు కార్పొరేషన్ కి కేటాయించిన భూమిలో వైసీపీ కార్యాలయం కట్టారని ఆరోపిస్తూ టీడీపీ అనుకూల మీడియా కథనాలిస్తోంది. ప్రస్తుతం తాడేపల్లిలో కూల్చివేత మొదలైంది కాబట్టి.. విశాఖ వైసీపీ కార్యాలయాలపై కూడా ప్రభుత్వం దృష్టిసారించే అవకాశముంది.