ఎవరి మెప్పుకోసం శిలాఫలకాల ధ్వంసం..

తాజాగా పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చేజర్లలో సచివాలయం, రైతు భరోసా కేంద్రాల శిలాఫలకాలను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.

Advertisement
Update:2024-07-18 08:14 IST

అధినేతలు మెచ్చుకోవాలంటే పార్టీ తరపున మంచిపనులు చేయాలి. ఇది ఒకప్పుడు.. ఇప్పుడు పార్టీ అధినాయకత్వం దృష్టిలో పడాలంటే పార్టీ పేరు చెప్పి వైరి వర్గాలకు వార్నింగ్ ఇవ్వాలి, వీలయితే వారితో సారీ చెప్పించాలి, ప్రత్యర్థి పార్టీ వారి విగ్రహాలు ధ్వంసం చేయాలి, వారి హయాంలో ఏర్పాటు చేసిన శిలా ఫలకాలు నేలకేసి కొట్టాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు దాటిపోతున్నా ఇంకా ఇలాంటి రెచ్చగొట్టే పనులు ఆగలేదు. ఒకరిని చూసి మరొకరు, ఒకచోట చూసి ఇంకోచోట ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో ప్రచారమే వీటి కొనసాగింపుకి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

తాజాగా పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చేజర్లలో సచివాలయం, రైతు భరోసా కేంద్రాల శిలాఫలకాలను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. టీడీపీ వాళ్లే చేశారనేది వైసీపీ వాదన. ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎలా ఉన్నా.. చేజర్లలో చేశారు, మన ఊరిలో చేయకపోతే మన ఇమేజ్ డ్యామేజీ అవదా అని టీడీపీ సానుభూతి పరులు ఆవేశపడొచ్చు. అలాంటివి చేస్తేనే గ్రామంలో పార్టీ గురించి గొప్పగా చెప్పుకుంటారని, వైరి వర్గం అణిగిమణిగి ఉంటుందనే అపోహ కూడా కారణం కావొచ్చు. పైగా ఇలాంటి పనులు చేసిన వారిపై కేసులు కూడా నమోదు కావనే ధైర్యం కూడా మరో కారణం కావొచ్చు. ఇలా అక్కడ చూసి ఇక్కడ, ఇక్కడ చూసి మరో చోట.. ఈ ధ్వంస రచన కొనసాగుతూనే ఉంది.

తప్పంతా మీదే..

వైసీపీ సుద్దులు చెప్పడం మాని గతంలోకి తొంగి చూడాలని టీడీపీ కౌంటర్లిస్తోంది. పక్క పార్టీ నాయకుడిని తిడితే వైసీపీ అధినేత పొంగిపోయేవారని, ఒకరకంగా తిట్టేవారినే ఆయన ఎంకరేజ్ చేసేవారని అక్కడినుంచే ఈ సంస్కృతి పుట్టుకొచ్చిందని అంటున్నారు. పోలీస్ కేసులతో టీడీపీ నోరు మూయించినా అప్పట్లో వైసీపీ సానుభూతిపరులు సోషల్ మీడియాలో చెలరేగిపోయేవారని విమర్శిస్తున్నారు. పార్టీ ఆఫీస్ లపై దాడుల్ని ప్రోత్సహించింది ఎవరని, టీడీపీ కేంద్ర కార్యాలయంపై సీసీ కెమెరాల సాక్షిగా జరిగిన విధ్వంసాన్ని ఏమనాలని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మొత్తమ్మీద.. విధ్వంసం పరిమాణం పెరిగిందా, తగ్గిందా అనే తర్కం పక్కనపెడితే.. కొనసాగుతుందనే విషయాన్ని సోషల్ మీడియాలో వీడియోలు బయటపెడుతున్నాయి. 

Tags:    
Advertisement

Similar News