జ‌గ‌న్ తాగే వాట‌ర్‌పై టీడీపీ సోష‌ల్ మీడియా ర‌చ్చ‌

తాజాగా జీ-20 స‌మావేశాల‌లో AaVa Alkaline వాట‌ర్ బాటిల్ సీఎం జ‌గ‌న్ ఎదుటే ఉండ‌టంతో మ‌రోసారి దొరికార‌ని సోష‌ల్ మీడియాలో పోస్టుల‌తో హోరెత్తిస్తోంది టీడీపీ.

Advertisement
Update:2023-03-30 19:27 IST

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై వాట‌ర్ వార్‌కి దిగింది టీడీపీ సోష‌ల్ మీడియా. విశాఖ‌ప‌ట్నంలో జ‌రిగిన జీ-20 స‌మావేశాల సంద‌ర్భంగా సీఎం ముందు టేబుల్ పై ఉన్న వాట‌ర్ బాటిల్‌పై నానా యాగీ చేస్తున్నారు. త‌మ నేత చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు రూ.65 ఉన్న హిమాల‌య వాట‌ర్ బాటిల్ తాగితేనే నానా యాగీ చేసిన వైసీపీ నేత‌లూ, ఇప్పుడు మీ నాయ‌కుడు ఈ రాష్ట్ర ముఖ్య‌మంత్రి తాగే AaVa Alkaline వాటర్ అక్షరాల రూ.1,012 అని, ఇది ఎవ‌రి సొమ్మంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌శ్నిస్తున్నారు.

టీడీపీ ఈ ఆవ ఆల్క‌లైన్ బాటిల్ రేటు కూడా త‌మ పోస్టుల‌కి ట్యాగ్ చేస్తోంది. టీడీపీ అధినేత సీఎంగా ఉన్న‌ప్పుడు, ఓడిపోయాక కూడా హిమాల‌య వాట‌ర్ ఏ స‌మావేశంలో ఉన్నా ఆయ‌న ముందు క‌నిపించేది. దీనిపై వైసీపీ చాలా పెద్ద క్యాంపెయిన్ సోష‌ల్ మీడియా వేదిక‌గా చేసింది. క్షేత్ర‌స్థాయిలో జ‌గ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో చంద్ర‌బాబు హిమాల‌య వాట‌ర్ అంశాన్ని గ‌ట్టిగానే వాడుకున్నారు. ప్ర‌జ‌లు తాగ‌డానికి మురికి నీరు, మీకేమో ప్ర‌జాధ‌నంతో హిమాల‌య వాట‌రా అంటూ జ‌గ‌న్ చాలా స‌భ‌ల‌లో నిల‌దీశారు.

2019 ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మి తర్వాత టీడీపీ కీల‌క స‌మావేశం నిర్వ‌హించింది. ఓట‌మికి దారితీసిన ప‌రిస్థితుల‌పై స‌మీక్షించుకుంది. ప్ర‌తీ చిన్న అంశాన్ని ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా వైసీపీ బాగా వాడుకుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ స‌మావేశంలో హిమాల‌య వాట‌ర్ పైకి చ‌ర్చ మ‌ళ్లింది. ప్ర‌జ‌ల సొమ్ముతో అత్యంత ఖ‌రీదైన నీరు చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేష్ తాగుతున్నార‌ని జ‌నాల్లోకి బాగా తీసుకెళ్లార‌ని, ఇక‌పై అంద‌రికీ మామూలు వాట‌ర్ పెట్టండ‌ని తీర్మానించార‌ని బ‌య‌ట‌కొచ్చింది స‌మాచారం.

హిమాల‌య వాట‌ర్ బాటిల్‌తో చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేష్‌, తెలుగుదేశం పార్టీకి తీవ్రంగానే న‌ష్టం చేసింది వైసీపీ. అటువంటి వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక సీఎం అయిన జ‌గ‌న్ కూడా హిమాల‌య వాట‌ర్‌తో ఫొటోల‌కి చిక్క‌డంతో ఇదేంటిది ముఖ్య‌మంత్రి గారూ..! అంటూ అప్ప‌ట్లో టీడీపీ సోష‌ల్ మీడియా ప్ర‌శ్నించింది. తాజాగా జీ-20 స‌మావేశాల‌లో AaVa Alkaline వాట‌ర్ బాటిల్ సీఎం జ‌గ‌న్ ఎదుటే ఉండ‌టంతో మ‌రోసారి దొరికార‌ని సోష‌ల్ మీడియాలో పోస్టుల‌తో హోరెత్తిస్తోంది టీడీపీ. ఎవ‌రిపైనైనా ఆరోప‌ణ‌లు చేసేట‌ప్పుడు, అవే ఆరోప‌ణ‌ల‌కి దొర‌కుండా వ్య‌వ‌హ‌రించ‌డం రాజ‌కీయ నేత‌లు పాటించ‌క‌పోతే, ఇలా ఎదురుదాడి ఎదుర్కోక త‌ప్ప‌దు అని మ‌రోసారి స్ప‌ష్ట‌మైంది.

Tags:    
Advertisement

Similar News