రెండోరోజు.. మహాత్ముడి సమాధి ముందు మౌన దీక్ష
రాజ్ ఘాట్ లో నారా లోకేష్ తో కలసి టీడీపీ ఎంపీలు నివాళులర్పించారు. అందరూ నల్లబ్యాడ్జీలు ధరించి మౌనదీక్ష చేపట్టారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని హైలైట్ చేయాలనుకుంటున్న టీడీపీ రెండోరోజు మహాత్మాగాంధీ సమాధి వద్ద మౌన దీక్ష చేపట్టింది. రాజ్ ఘాట్ లో నారా లోకేష్ తో కలసి టీడీపీ ఎంపీలు నివాళులర్పించారు. అందరూ నల్లబ్యాడ్జీలు ధరించి మౌనదీక్ష చేపట్టారు. చంద్రబాబు అరెస్ట్ ని ఖండించారు.
లోకేష్ ప్రయాస..
వాస్తవానికి ఢిల్లీలో కేంద్రంలోని పెద్దల అపాయింట్ మెంట్లకోసం లోకేష్ ఢిల్లీ వెళ్లారు. రోజులు గడుస్తున్నా ఎవరూ కనికరించలేదు, కనీసం లోకేష్ ని పలకరించలేదు. దీంతో ఎంపీలతో కలసి ఆయన రకరరాల విన్యాసాలు చేస్తున్నారు. ప్రత్యేక సమావేశాల తొలిరోజు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు లోకేష్. టీడీపీ ఎంపీలతో కలసి హడావిడి చేశారు. అఖిలపక్ష సమావేశంలో కూడా టీడీపీ నేతలు హడావిడి చేయాలని చూసినా.. దానికి కౌంటర్ గా రాజ్యసభలో విజయసాయిరెడ్డి చేసి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. చంద్రబాబుకి సింపతీకోసం టీడీపీ ప్రయత్నిస్తుంటే.. బాబు వెన్నుపోటు ఎపిసోడ్ ని రాజ్యసభలో వివరించి వారి పరువుతీశారు విజయసాయి.
లోకేష్ ఏదో అనుకుని ఢిల్లీకి వస్తే, అక్కడ ఇంకేదో జరుగుతోంది. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం కేంద్రంలోని పెద్దలకు అస్సలు ప్రాధాన్యత అంశంగా కనిపించడంలేదు. టీడీపీ నేతలు, టీడీపీ అనుకూల మీడియా హడావిడి మాత్రమే కనపడుతోంది. బలవంతంగా ఎవరితో అయినా స్టేట్ మెంట్ ఇప్పించాలని చూస్తున్నా అదీ కుదరడంలేదు. దీంతో మౌన ప్రదర్శనలు, నల్ల బ్యాడ్జీలతో నిరసనలు అంటూ టీడీపీ ఎంపీలతో కలసి లోకేష్ సీన్ క్రియేట్ చేస్తున్నారు.