పుంగనూరు అల్లర్ల వెనక ఇంత ప్లాన్ జరిగిందా?

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపైన వ్యతిరేకత తీసుకురావటం, జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టడమే లక్ష్యంగా టీడీపీ ప్లాన్ చేసిందట. దీనికి చంద్రబాబునాయుడు మొదలుపెట్టిన ప్రాజెక్టుల సందర్శన యుద్ధభేరి కార్యక్రమాన్ని వేదికగా చేసుకోవాలని ముందే ప్లాన్ చేశారట.

Advertisement
Update:2023-08-07 10:30 IST

నాలుగు రోజుల క్రితం పుంగనూరులోని అంగళ్ళ దగ్గర ఎంత గొడవ జరిగిందో తెలిసిందే. టీడీపీ శ్రేణులు, పోలీసులకు మధ్య మొదలైన గొడవ చివరకు టీడీపీ-పోలీసులు+వైసీపీ శ్రేణులుగా మారిపోయింది. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఆ అల్లర్లకు అసలు కారణం ఇది అని జగన్మోహన్ రెడ్డి మీడియా ‘మరణ’ హోమమే లక్ష్యం’ అనే హెడ్డింగ్‌తో కథనం ఇచ్చింది. పోలీసులను తీవ్రంగా గాయపరిచి వాళ్ళతో ఫైర్ ఓపెన్ చేయించి తమ కార్యకర్తలను బలిపెట్టాలని టీడీపీ పెద్దలు ప్లాన్ చేశారట. అయితే అది చివరి నిమిషంలో ఫెయిలైందని కథనంలో ఉంది.

ఇంతకీ విషయం ఏమిటంటే పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపైన వ్యతిరేకత తీసుకురావటం, జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టడమే లక్ష్యంగా టీడీపీ ప్లాన్ చేసిందట. దీనికి చంద్రబాబునాయుడు మొదలుపెట్టిన ప్రాజెక్టుల సందర్శన యుద్ధభేరి కార్యక్రమాన్ని వేదికగా చేసుకోవాలని ముందే ప్లాన్ చేశారట. అందుకనే పుంగనూరు బైపాస్ రోడ్డు మీదుగా చిత్తూరుకు వెళ్ళాల్సిన చంద్రబాబు సడెన్‌గా పుంగనూరు టౌన్లోకి ఎంటరయ్యారట. తాము టౌన్లోకి ఎంటర్ కాకుండా పోలీసులు అడ్డుకుంటారని ముందే ఊహించి వాళ్ళపైకి దాడులుచేసి గాయపరచటం లేదా చంపటాన్ని ప్లాన్ చేశారట.

అందుకనే పోలీసులను గాయపరిచేందుకు ముందుగానే బీరు బాటిళ్ళు, రాళ్ళు, కర్రలు రెడీగా ఉంచుకున్నారట. టీడీపీ అనుకున్నట్లుగానే టౌన్లోకి చంద్రబాబు ఎంటర్ కాకుండా పోలీసులు అడ్డుకున్నారు. అప్పుడు పోలీసులు, టీడీపీ నేతలకు మధ్య తీవ్రస్థాయిలో పెనుగులాట మొదలైంది. ఇదే అదునుగా ముందుగా ప్లాన్ చేసుకున్నట్లు రాళ్ళు, కర్రలతో పోలీసులపైకి టీడీపీ మూకలు దాడులు మొదలుపెట్టాయి. దాన్ని ఊహించని పోలీసులు షాక్‌కు గురై తర్వాత తేరుకుని లాఠీచార్జి మొదలుపెట్టారు.

టీడీపీ శ్రేణులు మరింతగా రెచ్చిపోయి బీరు, మద్యం బాటిళ్ళని విసరటం మొదలుపెట్టారు. గురిచూసి పోలీసుల తలలపైనే కొట్టారట. దాంతో చాలామంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ విషయం తెలియగానే వెంటనే వైసీపీ శ్రేణులు కూడా అక్కడకు చేరుకుని పోలీసులకు మద్దతుగా నిలిచారు. దాంతో రెండువైపులా పెద్ద యుద్ధమే జరిగింది. పోలీసులు గాయపడటాన్ని ఎస్పీకి ఒక డీఎస్పీ ఫోన్లో వివరించి ఫైరింగ్‌కు ఆర్డర్ కావాలన్నారట. అయితే ఎస్పీ అందుకు అంగీకరించకుండా ఉన్న ప్రాంతం నుండి 30 మీటర్లు వెనక్కు వచ్చేయాలని ఆదేశించారట.

తమను తరుముకుంటు పోలీసులు మీదకు వచ్చేస్తారని అనుకున్న టీడీపీ వాళ్ళకి పోలీసులు వెనక్కు జరగటంతో ఏమిచేయాలో అర్థంకాక పోలీసులు వాహనాలకు నిప్పుపెట్టారట. ఇదంతా పుంగనూరు ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి పీఏ గోవర్ధనరెడ్డి పోలీసుల విచారణలో చెప్పినట్లు సదరు మీడియా చెప్పింది. పోలీసుల మీద దాడులు చేసి తీవ్రంగా గాయపరిస్తే వెంటనే ఫైర్ ఓపెన్ అవుతుందని అనుకున్నారట. ఆ ఫైరింగ్ లో కనీసం ఓ 30 మందైనా టీడీపీ కార్యకర్తలు చనిపోతారు అప్పుడు దేశమంతా ఈ ఘటన పాకిపోతుందని ప్లాన్‌ చేస్తే అదికాస్త ఫెయిలైందని గోవర్ధన్ చెప్పాడట.

Tags:    
Advertisement

Similar News