చింతూరు- భద్రాచలం దూరం.. - మంత్రి రజనీపై ట్రోల్‌

ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ అసెంబ్లీలో ఇచ్చిన వివరణపై టీడీపీ వాళ్లు ట్రోల్ చేస్తున్నారు.

Advertisement
Update:2022-09-21 09:14 IST

ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ అసెంబ్లీలో ఇచ్చిన వివరణపై టీడీపీ వాళ్లు ట్రోల్ చేస్తున్నారు. పోలవరం విలీన మండలాల్లో విష జ్వరాలు విజృంభిస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని.. దాంతో ఏజెన్సీ వాసులు తెలంగాణలోని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి వెళ్లి వైద్య సేవలు పొందుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అసెంబ్లీలో విమర్శించారు.

ఏజెన్సీ వాసులకు ప్రభుత్వ వైద్యం అందడం లేదని, అందుకే వారు తెలంగాణ ప్రాంతానికి, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే అసెంబ్లీలో విమర్శించారు. అందుకు సమాధానంగా స్పందించిన మంత్రి రజనీ.. టీడీపీ ఎమ్మెల్యే విమర్శలను తోసిపుచ్చారు. ఏపీలో వైద్యం అందక గిరిజనులు భద్రాచలం ఆస్పత్రికి వెళ్తున్నారన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. చింతూరు నుంచి భద్రాచలానికి కేవలం 30-35 కి.మీ మాత్రమే ఉంటుందని.. దగ్గర కాబట్టే రోగులు భద్రాచలం వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారని మంత్రి వివరణ ఇచ్చారు.

చింతూరు- భద్రాచలం మధ్య దూరం కేవలం 35 కి.మీ మాత్రమే అందుకే విలీన మండలాల ప్రజలు భద్రాచలం ఆస్పత్రికి వెళ్తున్నారని మంత్రి చెప్పడంతో.. అసలు చింతూరుకు, భద్రాచలం మధ్య దూరం 35 కి.మీ కాదు.. 65 కి.మీ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ మొదలైంది. ఏపీ ప్రజలు వైద్యం కోసం పక్క రాష్ట్రం మీద ఆధారపడుతుంటే దాన్ని సరి చేయాల్సింది పోయి, దగ్గర కాబట్టి అటు వెళ్తున్నారంటూ 30 కి.మీ దూరాన్ని తగ్గించి అసెంబ్లీలో మంత్రి సత్యదూరమైన మాటలు మాట్లాడడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

చింతూరు ఏరియా ఆస్పత్రిలో ఒక్క రెగ్యులర్ డాక్టర్‌ కూడా లేకపోవడం, రాజమండ్రి నుంచి ఒక వైద్యుడు వారానికి ఒకసారి వచ్చి చింతూరు ఆస్పత్రిలో వైద్య సేవల అందిస్తున్నారని అందువల్లనే ఇక్కడి ప్రజలు భద్రాచలం ఆస్పత్రికి వెళ్తున్నారని టీడీపీ విమర్శిస్తోంది.

Tags:    
Advertisement

Similar News