యువగళంలో జనాలు సరే, సొంత పార్టీ ఎంపీలెక్కడ..?
ఓవైపు చేరికలతో టీడీపీ బలం పెరుగుతోందని ఆ పార్టీ సంతోష పడుతున్నా.. ఉన్న నేతలు కూడా యువగళంలో కలసి రాకపోవడంతో వైరి వర్గాలకు అవకాశం దొరికినట్టయింది. గుంటూరు, విజయవాడ ఎంపీల వ్యవహారంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది.
నాారా లోకేష్ యవగళం విజయవాడకు చేరుకోగానే టీడీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా అకౌంట్లలో హుషారు మరింత పెరిగింది. చినబాబు యాత్రకు జనాలు తండోపతండాలుగా వస్తున్నారని, యువగళం యాత్రకు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అంటున్నారు. ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో వస్తోందని చెప్పుకుంటున్నారు. అంతాబాగానే ఉంది కానీ అసలు మీ పార్టీ ఎంపీలెక్కడ అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. విజయవాడలో లోకేష్ యాత్రకు స్థానిక ఎంపీ కేశినేని నాని డుమ్మా కొట్టారు.
గతంలో కూడా ఎంపీ కేశినేని నాని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. అవసరమైతే హడావిడి చేస్తారు, అధినేత చంద్రబాబుపై సెటైర్లు వేస్తారు, చల్లగా వెళ్లిపోతారు. యువగళంకు కేశినేని వస్తాడని కూడా ఎవరూ అనుకోలేదు, ఆయన కూడా యాత్రకు దూరంగా ఉండి తన అసంతృప్తిని మరోసారి బయటపెట్టుకున్నారు. దీంతో విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఇతర స్థానిక నాయకులతోనే యాత్ర కానిచ్చేస్తున్నారు లోకేష్.
విజయవాడకంటే ముందు గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా లోకేష్ యాత్ర కొనసాగింది. అక్కడ కూడా స్థానిక ఎంపీ గల్లా జయదేవ్ యువగళం యాత్రకు హాజరు కాలేదు. అయితే ఆయన ఇప్పటి వరకు పార్టీ లైన్ దాటలేదు, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. పోనీ పార్టీలోనే ఉన్నారనుకున్నా, ఎంపీ లేకుండా యువగళం యాత్ర జరగడం మాత్రం విశేషం.
ఓవైపు చేరికలతో టీడీపీ బలం పెరుగుతోందని ఆ పార్టీ సంతోష పడుతున్నా.. ఉన్న నేతలు కూడా యువగళంలో కలసి రాకపోవడంతో వైరి వర్గాలకు అవకాశం దొరికినట్టయింది. గుంటూరు, విజయవాడ ఎంపీల వ్యవహారంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. లోకేష్ కి ఆ ఇద్దరు ఎంపీలు హ్యాండిచ్చారని వైసీపీ సెటైర్లు పేలుస్తోంది.