చంద్రబాబుకు గల్లా షాకిచ్చారా..?

సడెన్ గా చెవిరెడ్డితో గల్లా భేటీ అవటం టీడీపీలో సంచలనంగా మారింది. చెవిరెడ్డి-గల్లా భేటీ వార్తను కవర్ చేయకుండా ఎల్లోమీడియా జాగ్రత్తపడింది. అయితే ఈ విషయం మిగిలిన మీడియాతో పాటు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యింది.

Advertisement
Update:2024-01-11 10:56 IST

ఉరుములేని పిడుగంటే ఇదేనేమో. టీడీపీ కీలక నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ వైసీపీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో ఒకరైన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో జయదేవ్ చాలాసేపు భేటీ అయ్యారు. చెవిరెడ్డితో గల్లా భేటీ అయ్యారన్న విషయం బయటపడగానే చంద్రబాబుకు షాక్ కొట్టుంటుంది. ఎందుకంటే.. రాబోయే ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీచేయటంలేదని చంద్రబాబుకు చాలాకాలం క్రితమే గల్లా చెప్పేశారు. ప్రత్యామ్నాయంగా వేరే అభ్యర్థిని చూసుకోమని కూడా చెప్పారు.

అంతకుముందు నుంచే పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనబడటంలేదు. జయదేవ్ తల్లి గల్లా అరుణ కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు. పాలిట్ బ్యూరో సభ్యత్వానికి కూడా ఆమె రాజీనామా చేసేశారు. గల్లా చెప్పిన కారణంగానే చంద్రబాబు కూడా గుంటూరు ఎంపీగా గట్టి నేతలకోసం అన్వేషిస్తున్నారు. ఆలపాటి రాజా తదితరుల పేర్లను చంద్రబాబు పరిశీలిస్తున్నారు. పరిశ్రమ విస్తరణలో భాగంగానే తాను కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు జయదేవ్ చాలాసార్లు చెప్పారు.

సీన్ కట్ చేస్తే.. సడెన్ గా చెవిరెడ్డితో గల్లా భేటీ అవటం టీడీపీలో సంచలనంగా మారింది. చెవిరెడ్డి-గల్లా భేటీ వార్తను కవర్ చేయకుండా ఎల్లోమీడియా జాగ్రత్తపడింది. అయితే ఈ విషయం మిగిలిన మీడియాతో పాటు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యింది. గల్లా ఫ్యామిలీ వైసీపీలో చేరబోతోందా అనే చర్చ పెరిగిపోతోంది. వైసీపీ తరపున గల్లా గుంటూరు ఎంపీగా పోటీచేయబోతున్నారా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. దీనికి కారణం ఏమిటంటే విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని అనే చెప్పాలి.

జగన్మోహన్ రెడ్డితో కేశినేని భేటీ అయిన కొద్దిసేపటికే చెవిరెడ్డి-గల్లా భేటీ విషయం వెలుగుచూసింది. కేశినేని-గల్లా బాగా సన్నిహితులన్న విషయం తెలిసిందే. నాని వైసీపీలో చేరుతూ గల్లాను కూడా చేర్చుతున్నారా అనే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇదే జరిగితే టీడీపీకి పెద్ద దెబ్బనే చెప్పాలి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. చాలాకాలంగా గల్లా కుటుంబాన్ని జగన్ దూరం పెడుతున్నారు. తెరవెనుక ఎలాంటి డెవలప్మెంట్లు జరిగాయో ఏమో చెవిరెడ్డితో గల్లా భేటీ అయ్యారు. భేటీ రిజల్ట్‌ ఏమిటో చూడాలి.

Tags:    
Advertisement

Similar News