ఆత్మస్తుతి, పరనింద.. మహానాడు తొలిరోజు
రావణాసురుడు సాధువు రూపంలో వచ్చి సీతను అపహరించినట్టు.. జగన్ ఒక్క ఛాన్స్ అంటూ ఏపీ ప్రజల దగ్గర ఓట్లు వేయించుకున్నారని చెప్పారు చంద్రబాబు . 2వేల రూపాయల నోట్లన్నీ జగన్ వద్దే ఉన్నాయని ఆరోపించారు.
మహానాడు తొలిరోజు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగమంతా ఆత్మస్తుతి, పరనిందలా సాగింది. జగన్ ని ఇంకా ఒక్క ఛాన్స్ సీఎంలాగే సంబోధిస్తున్నారు చంద్రబాబు. ఒక్క ఛాన్స్ తో అంతా నాశనం చేశారని, తానొచ్చి ఏపీని ఉద్ధరించాలని, దానికి ప్రజలంతా సహకరించాలని పరోక్షంగా తనని తాను హైలెట్ చేసుకున్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అంటూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు.
ఉపమానాలకు కొదవే లేదు..
గతంలో చంద్రబాబు ప్రసంగాల్లో ఎక్కువగా గణాంకాలు దొర్లేవి, ఇటీవల ఆయన కూడా ఉపమానాల వెంటపడుతూ పంచ్ డైలాగులు వెదుక్కుంటున్నారు. ఏపీ పిచ్చోడి చేతిలో రాయిలా మారిందన్నారు చంద్రబాబు. ఆ రాయి పేదలకు తగలకుండా తాము అడ్డుగా ఉన్నామని, తిరిగి అదే రాయితో వైసీపీని చిత్తు చిత్తుగొ కొడతామన్నారు. జరిగేది కురుక్షేత్రం, అజాగ్రత్త వద్దే వద్దు అంటూ పార్టీ శ్రేణుల్లో ఊపు తెచ్చే ప్రయత్నం చేశారు. పేదవాడు ధనికుడు కావడమే తన ఆశయం అని.. జగన్ మాత్రం ఆయనొక్కడే ధనవంతుడు కావాలనుకుంటున్నారని మండిపడ్డారు.
ఏపీలో సంపద దోపిడీ ఎక్కువ, ధరల బాదుడు ఎక్కువ అన్నారు చంద్రబాబు. స్కామ్ లలో మాస్టర్ మైండ్ జగన్ అని ఎద్దేవా చేశారు. జగన్ నోరు తెరిస్తే అబద్దాలే మాట్లాడతారని, కోడికత్తి ఒక డ్రామా అని మద్య నిషేధం మరో డ్రామా అని అన్నారు. రావణాసురుడు సాధువు రూపంలో వచ్చి సీతను అపహరించినట్టు.. జగన్ ఒక్క ఛాన్స్ అంటూ ఏపీ ప్రజల దగ్గర ఓట్లు వేయించుకున్నారని చెప్పారు. 2వేల రూపాయల నోట్లన్నీ జగన్ వద్దే ఉన్నాయని ఆరోపించారు.
రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ రికార్డ్..
పేదలకు ఫించన్లివ్వడం మొదలు పెట్టింది టీడీపీయేనని చెప్పుకొచ్చారు చంద్రబాబు. టీడీపీ విజన్ ఏంటో హైదరాబాద్ ని చూస్తే తెలుస్తుందన్నారు. రాష్ట్రాన్ని నాశనం చేయడం ప్రజా వేదిక నుంచే మొదలైందని విమర్శించారు. అన్ని వ్యవస్థలను జగన్ నాశనం చేశారని, ప్రపంచ చరిత్రలో రాజధాని లేని రాష్ట్రం ఏపీ ఒక్కటేనన్నారు. పోలవరాన్ని గోదావరిలో కలిపేశారని, ఏపీలో రోడ్లు ఆధ్వాన్నంగా మారాయని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం మెడలు వంచుతానన్న జగన్, కేసుల కోసం కేంద్రం ముందు సాష్టాంగ పడ్డారని కౌంటర్లిచ్చారు. నాలుగేళ్లపాటు టీడీపీ కార్యకర్తలు ఎన్నో కష్టాలు పడ్డారని, అయినా భయపడకుండా వారంతా పార్టీ వెంటే నిలబడ్డారని చెప్పారు చంద్రబాబు.