ఏపీ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత... సమీపంలో ఓ భవనంపైకి ఎక్కి టీడీపీ నేతల ఆందోళన

ఏపీ అసెంబ్లీ వద్ద తెలుగు దేశం నాయకులు నిరసన ప్రదర్శన చేశారు. సమీపంలోని బిల్డింగ్ ఎక్కి జగన్ సర్కార్ కు వ్యతిరేక‍ంగ నినాదాలు చేశారు.

Advertisement
Update:2022-09-20 11:40 IST

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వద్ద పోలీసులకు, టీడీపీ నేతలకు మధ్య వాగ్వివాదంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ నేతలు అసెంబ్లీకి దగ్గరలోని ఓ బిల్డింగ్ పైకి ఎక్కి నినాదాలు చేస్తుండటంతో వాళ్ళను కిందికి దించడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నించాల్సి వచ్చింది.

వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తోందని ఆరోపిస్తూ, వైసీపీ ప్రభుత్వ‌ పాలనకు వ్యతిరేకంగా ఈ రోజు టీడీపీ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించింది. పలువురు నేతలు అసెంబ్లీలోకి చొచ్చుకెళ్ళడానికి ప్రయత్నించగా వాళ్ళను పోలీసులు అడ్డుకున్నారు. కొంత సేపు ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అనంతరం టీడీపీ నేతలు అసెంబ్లీకి దగ్గరలో ఉన్న ఓ బిల్డింగ్ పైకి ఎక్కి జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. ముఖ్యమంత్రి జగన్ దళిత ద్రోహి అంటూ, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు నేతలు పాల్గొన్నారు.

దీంతో పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న పోలీసులు అతి కష్టం మీద టీడీపీ నేతలను కిందికి దించి పోలీసు స్టేషన్ కు తరలించారు.

Tags:    
Advertisement

Similar News