అంతా అచ్చెన్న చేస్తున్నారా..? ఎవరైనా చేయిస్తున్నారా?
సోషల్ మీడియాలోనూ ఓ వర్గం ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరుతో ఫేక్ లెటర్లు విడుదల చేస్తూ గందరగోళానికి గురి చేస్తుంది. ఇవి ఫేక్ అంటూ టీడీపీ అఫీషియల్ సోషల్ మీడియా ఖాతాల నుంచి రోజూ ఖండించాల్సి వస్తోంది.
ఏ ముహూర్తాన ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా అచ్చెన్నాయుడు బాధ్యతలు స్వీకరించారో కానీ, ఆయన పేరుతో నిత్యం ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంది. ఆయనకి సంబంధం ఉండి కొన్ని, ప్రమేయం లేకుండా మరికొన్ని వివాదాలు అచ్చెన్నకు చుట్టుకుంటున్నాయి. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కొత్తలో తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా ఒక రెబల్ కార్యకర్తతో మాట్లాడుతూ హిడెన్ కెమెరాకి చిక్కాడు. `పార్టీ లేదు బొక్కా లేదు` అంటూ లోకేష్ నాయకత్వంపై అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
ఇటీవల కాలంలో పార్టీలో ఏ వివాదం జరిగినా దాన్ని సరిదిద్దేందుకు అధినేత చంద్రబాబు ఆదేశాలతో అచ్చెన్నాయుడు రంగంలోకి దిగుతున్నారు. ఇరువర్గాలకు నచ్చజెప్పి వస్తున్నారు. మందలింపునకి గురైన వారు, పదవులు దక్కని వారు అచ్చెన్నాయుడే కారణమంటూ నిందిస్తున్నారు. అంతా అధిష్టానం ఆదేశాలతో జరుగుతున్నా, దోషిగా తనను అంతా తప్పుబట్టడంతో పార్టీ అధ్యక్షుడిగా ఆవేదనకి గురవుతున్నారు.
సోషల్ మీడియాలోనూ ఓ వర్గం ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరుతో ఫేక్ లెటర్లు విడుదల చేస్తూ గందరగోళానికి గురి చేస్తుంది. ఇవి ఫేక్ అంటూ టీడీపీ అఫీషియల్ సోషల్ మీడియా ఖాతాల నుంచి రోజూ ఖండించాల్సి వస్తోంది. అసలు అచ్చెన్నాయుడిని ఇంటా, బయటా అంతా కలిసి మరీ ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థంకాక ఆయన అభిమానులు తలలు పట్టుకుంటున్నారు.
ఉత్తరాంధ్రలో చాలా నియోజకవర్గాలలో టీడీపీ సీటు కోసం నేతల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. సీనియర్ నేతలకీ ఆశావహుల నుంచి సీటు విషయంలో అభద్రత నెలకొంది. తమకి పోటీగా నియోజకవర్గాలలో సమాంతరంగా టీడీపీ కార్యక్రమాలు చేస్తున్న టికెట్ యాస్పిరెంట్స్‌కి పరోక్షంగా అచ్చెన్నాయుడు మద్దతు ఉందని సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నారు. తన ఎచ్చెర్ల నియోజకవర్గంలో కలిశెట్టి అప్పలనాయుడుని ప్రోత్సహిస్తూ వర్గ రాజకీయాలకి అచ్చెన్నాయుడు తెరతీశారని కిమిడి కళా వెంకటరావు ఆగ్రహంగా ఉన్నారు. శ్రీకాకుళంలో తన సీటుకు పోటీగా గొండు శంకర్‌ని దించింది అచ్చెన్నాయుడేనని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి నేరుగా అధినేత చంద్రబాబుకి ఫిర్యాదు చేశారు. పాతపట్నం నియోజకవర్గంలోనూ మామిడి గోవిందరావు తనకి అచ్చెన్నాయుడు ఆశీస్సులతోపాటు లోకేష్ అండ ఉందని ప్రచారం చేసుకోవడంతో కలమట వెంకటరమణమూర్తి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పార్టీ అధ్యక్షుడుగా క్షణం తీరిక లేకుండా పనిచేస్తుంటే, తనని లక్ష్యంగా చేసుకుని అధికారపక్షం దాడికి తోడు.. సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారంపై అచ్చెన్న లోలోపల తీవ్రంగా ఆవేదన చెందుతున్నారని సమాచారం.