యనమల సోదరుడి ఆడియో టేపు కలకలం
కృష్ణుడికి టికెట్ ఇవ్వకపోతే మరోసారి దాడిశెట్టి రాజానే గెలవబోతున్నారని చెప్పాలని సలహా ఇచ్చాడు. ఇవన్నీ మీరు మెత్తగా చెబితే తన అన్న వినడని కాబట్టి గట్టిగా చెప్పాలని సూచించారు.
యనమల రామకృష్ణుడి సోదరుడు కృష్ణుడి ఆడియో టేపు ఇప్పుడు కలకలం రేపుతోంది. యనమల రామకృష్ణుడు తుని టికెట్‌ను వచ్చే ఎన్నికల్లో తన కుమార్తె దివ్యకు ఇప్పించేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలో యనమల రామకృష్ణుడి సోదరుడు యనమల కృష్ణుడు సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఒక ఆడియో టేపు కూడా బయటకు రావడంతో టికెట్ అంశం సంచలనంగా మారింది.
తొండండి మండల నాయకుడికి ఫోన్ చేసిన యనమల సోదరుడు కృష్ణుడు.. టికెట్ దివ్యకు ఇవ్వకుండా అడ్డుకోవాలని సూచించారు. ఊరికి 40 మంది వెళ్లి తన అన్నను నిలదీయాలని ఉసిగొల్పారు. తునిలో కృష్ణుడు లేకుంటే టీడీపీనే లేదని తన అన్న యనమల రామకృష్ణుడికి చెప్పాలని సలహా ఇచ్చారు. తన అన్న తెలివిగా ఇంకా టికెట్ ఎవరికీ ఖాయం కాలేదని చెబుతారని.. ఆ మాటలను నమ్మద్దని కూడా టీడీపీ నేతకు యనమల కృష్ణుడు స్పష్టం చేశారు.
కృష్ణుడికి టికెట్ ఇవ్వకపోతే మరోసారి దాడిశెట్టి రాజానే గెలవబోతున్నారని చెప్పాలని సలహా ఇచ్చాడు. ఇవన్నీ మీరు మెత్తగా చెబితే తన అన్న వినడని కాబట్టి గట్టిగా చెప్పాలని సూచించారు. అందుకు సదరు నేత కూడా అంగీకరించారు. మీరు చెప్పినట్టుగానే యనమల రామకృష్ణుడికి చెబుతామని ఫోన్‌లో చెప్పాడు.