హామీ మరిచారా? కావాలనే మోసగించారా? - సీఎం జగన్‌కు లోకేశ్ లేఖ
థర్డ్ పార్టీ వ్యవస్థ రద్దు, సమాన పనికి సమానవేతనం, రెగ్యులర్ చేస్తామని చెప్పినవాటిలో ఏ ఒక్కటికీ ఇప్పటికీ ప్రతిపాదన దశకి కూడా రాలేని, ఉద్దేశపూర్వకంగానే కాంట్రాక్టు కార్మికులని మోసం చేశారని లోకేశ్ ఆరోపించారు.
విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలంటూ సీఎం జగన్‌కి నారా లోకేష్ లేఖ రాశారు. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు ప్రజాసంకల్ప యాత్రలో వారికి ఇచ్చిన హామీలు గుర్తు చేసేందుకు ఈ లేఖ రాస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే విద్యార్హత, అనుభవం, సర్వీసుని పరిగణనలోకి తీసుకుని రెగ్యులర్ చేస్తామని, యాజమాన్యానికి-కార్మికులకు మధ్య ఉన్న దళారీ వ్యవస్థని రద్దు చేసి విద్యుత్ సంస్థ నుంచే జీతాలు ఇప్పిస్తామని చెప్పిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచిపోయిందని, విద్యుత్ కాంట్రాక్టు కార్మికులకి ఇచ్చిన హామీని ఇప్పటికైనా గుర్తుకుతెచ్చుకుని నెరవేర్చేందుకు కృషి చేయాలని కోరారు. దశాబ్దాలకాలంగా ఏపీ ట్రాన్స్‌కో, జెన్ కో, డిస్కంలలో 26 వేల మంది కాంట్రాక్టు కార్మికులు ఉద్యోగ భద్రత లేకుండా పనిచేస్తున్నారని అన్నారు. థర్డ్ పార్టీ దళారీలు మింగేయగా వచ్చే చాలీచాలని వేతనాలతో కష్టాలపాలవుతున్నారని పేర్కొన్నారు. కుటుంబ జీవనం కష్టంగా మారిన పరిస్థితుల్లో కాంట్రాక్టు కార్మికులు ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నారని చెప్పారు. థర్డ్ పార్టీ వ్యవస్థ రద్దు, సమాన పనికి సమానవేతనం, రెగ్యులర్ చేస్తామని చెప్పినవాటిలో ఏ ఒక్కటికీ ఇప్పటికీ ప్రతిపాదన దశకి కూడా రాలేని, ఉద్దేశపూర్వకంగానే కాంట్రాక్టు కార్మికులని మోసం చేశారని లోకేశ్ ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు కార్మికులని విద్యుత్ సంస్థలో విలీనం చేసుకుని ప్రొబేషనరీ కాలం ముగిశాక 24 వేలమందికి పైగా రెగ్యులర్ చేశారని ఈ సందర్భంగా లోకేశ్ గుర్తు చేశారు. గతంలో విద్యుత్ జేఏసీ ఆందోళనలకి పిలుపునిచ్చిన నేపథ్యంలో విద్యుత్‌శాఖ మంత్రి, ఇంధనశాఖ కార్యదర్శి, విద్యుత్ యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేశారని అన్నారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు-అవుట్ సోర్సింగ్ కార్మికులకు యాజమాన్యం నుంచే వేతనాలు అందించేందుకు, ఆరోగ్యబీమా, ప్రమాదబీమా, పదవీ విరమణ ప్రయోజనాలు, కారుణ్య నియామకాలు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో ఎలా అమలుచేస్తున్నారో అధ్యయనం చేసి సిఫారసు చేయాలని 60 రోజులు గడువు విధించినట్లు పేర్కొన్నారు. 2020 నంబర్‌లో నాటి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మీటింగ్ జరినట్లు లోకేశ్ తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన మీటింగ్‌లోనూ కమిటీ ఇచ్చే నివేదికపై ఆధారపడి ప్రయోజనాల కల్పన ప్రణాళిక ఉంటుందని తేల్చారని లోకేశ్ అన్నారు. 60 రోజులు కాస్తా 660 రోజులు దాటిపోయినా సీఎం ఇచ్చిన హామీ నెరవేరలేదని తెలిపారు.
కాంట్రాక్టు/అవుట్ సోర్సింగ్ కార్మికులకు వేతనాలు ఇచ్చే థర్డ్ పార్టీ సంస్థ కమీషన్లు, జీఎస్టీ రూపంలో ఏడాదికి రూ.149 కోట్లు కార్మికుల కష్టాన్ని మింగేస్తోందని లోకేశ్ ఆరోపించారు. దళారీ సంస్థ దోపిడీ వల్ల కాంట్రాక్టు కార్మికునికి రావాల్సిన రూ.26 వేలు వేతనంలో కటింగులన్నీ పోను రూ.18,500 చేతికి వస్తోందని అన్నారు. సెలవుల్లేకుండా, రాత్రీ పగలనే తేడా లేకుండా ప్రమాదకరమైన పనులు చేస్తున్న కాంట్రాక్టు కార్మికుల జీవితాలు అరకొర జీతాలతో అగమ్యగోచరం మారాయని అభిప్రాయపడ్డారు. ప్రమాదమో, ఆరోగ్య సమస్య తలెత్తితే చందాలు ఎత్తితే తప్పించి కష్టం ఒడ్డెక్కే పరిస్థితి లేదరి లోకేశ్ తెలిపారు. ఇప్పటికైనా కాంట్రాక్టు కార్మికులకు ఇచ్చిన మేరకు హామీ నెరవేర్చాలని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు విద్యార్హత, వయస్సు,అనుభవం పరిగణనలోకి తీసుకుని తక్షణమే రెగ్యులర్ చేయాలని లోకేశ్ డిమాండ్ చేశారు.