వదల సాక్షీ.. నిన్నొదల అంటోన్న లోకేష్
ఆ పత్రిక తాను విశాఖలో ఉన్నానని ప్రచురించిన తేదీల్లో తాను అసలు విశాఖలోనే లేనని ఖండించారు. ప్రభుత్వం ఆహ్వానం మీద వచ్చే అతిథులకు చేసిన అతిథి మర్యాదల కోసం చేసిన ఖర్చుని తనపై రుద్దారని ఆవేదన వ్యక్తం చేశారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సాక్షి పత్రికని వదల బొమ్మాళి నిన్నొదల అంటూ వెంటాడుతున్నారు. `చినబాబు చిరుతిండి 25 లక్షలండి ` శీర్షికతో సాక్షిలో 2019 అక్టోబర్ 22న ఓ కథనం ప్రచురించారు. దీనిపై వివరణ వేయాలని నారా లోకేష్ సాక్షికి లీగల్ నోటీసులు పంపారు. దీనిపై పత్రిక బాధ్యులు స్పందించకపోవడంతో పరువునష్టం దావా వేశారు. 6/2020 నెంబరుతో విశాఖ కోర్టులో సాక్షి పత్రికపై 75 కోట్లకు, డెక్కన్ క్రానికల్ పత్రికపై 25 కోట్లకు పరువునష్టం దావా వేశారు. ఈ కేసులో విచారణకు నారా లోకేష్ కోర్టుకి కూడా హాజరయ్యారు. రెండేళ్లు తరువాత నారా లోకేష్ వేసిన పరువునష్టం దావా విచారణకు అర్హమైనదేనని విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానం స్పష్టం చేసింది.
``చినబాబు చిరుతిండి 25 లక్షలండి`` హెడ్డింగ్‌తో 2019 అక్టోబర్ 22న సాక్షి పేపరులో ఓ పరిశోధనాత్మక కథనం వేశారు. అవాస్తవాలతో ఉద్దేశపూర్వకంగా తనను డ్యామేజ్ చేయాలని ఈ స్టోరీ వేశారని న్యాయవాదుల ద్వారా రిజిస్టర్ నోటీసు సాక్షికి పంపించారు. సాక్షి ఇచ్చిన రిప్లయ్ పట్ల సంతృప్తి చెందని నారా లోకేష్ పరువునష్టం దావా వేశారు. తన పరువుకు భంగం కలిగించేందుకు అసత్యాలతో కథనం వేశారని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.
ఆ పత్రిక తాను విశాఖలో ఉన్నానని ప్రచురించిన తేదీల్లో తాను అసలు విశాఖలోనే లేనని ఖండించారు. ప్రభుత్వం ఆహ్వానం మీద వచ్చే అతిథులకు చేసిన అతిథి మర్యాదల కోసం చేసిన ఖర్చుని తనపై రుద్దారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రిగా తాను అనేక సార్లు విశాఖపట్నం వెళ్లినా ఎయిర్ పోర్ట్ లో ఎటువంటి ప్రోటోకాల్ సౌకర్యాలు తాను స్వీకరించలేదని స్పష్టం చేశారు. సాక్షిపై నారా లోకేష్ వేసిన పరువునష్టం దావా, ఆయన పాదయాత్ర ఆరంభించే సమయంలో మళ్లీ విచారణ అర్హమేనని కోర్టు ప్రకటించడంతో చర్చనీయాంశమైంది.