కొత్త పంచాయితీ.. వసంత కృష్ణప్రసాద్‌కు మరో ఎదురుదెబ్బ
ఇప్పటికే నియోజకవర్గంలోని టీడీపీ నాయకులను కృష్ణప్రసాద్ కలుస్తున్నారు. మార్చి 2వ తేదీన వసంత టీడీపీలో చేరుతున్నారు.
టీడీపీలో చేరి మైలవరం నుంచి పోటీ చేయడానికి సిద్దపడిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు మరో సమస్య వచ్చి పడింది. మైలవరం శాసనసభా నియోజకవర్గంలో కొత్త పంచాయితీ ప్రారంభమైంది. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావును పక్కన పెట్టి వసంత కృష్ణప్రసాద్‌కు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు టికెట్ ఖరారు చేస్తున్నారు. దీనిపై దేవినేని భగ్గుమన్నారు. దీంతో చంద్రబాబు ఆయనను పిలిపించి మాట్లాడారు. ఆయనకు చంద్రబాబు ఏం చెప్పారో, దేవినేని ఉమా ఏం చేయదలుచుకున్నారో తెలియడం లేదు. ఈలోగా మరో చిక్కుముడి పడింది.
వసంత కృష్ణప్రసాద్‌కు సహకరించేది లేదని టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావు అంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని టీడీపీ నాయకులను కృష్ణప్రసాద్ కలుస్తున్నారు. మార్చి 2వ తేదీన వసంత టీడీపీలో చేరుతున్నారు. దేవినేని ఉమాతో తనకు వ్యక్తిగత విభేదాలు లేవని చెప్పుతున్నప్పటికీ, సంబంధాలు అంత సజావుగా లేవనేది అర్థమవుతూనే ఉంది.
ఇదే సమయంలో బొమ్మసాని సుబ్బారావు సహకారం కోసం కృష్ణప్రసాద్ ప్రయత్నిస్తున్నారు. తన కుమారుడికి సహకరించాలని వసంత కృష్ణప్రసాద్ తండ్రి, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు ఇప్పటికే బొమ్మసాని సుబ్బారావును కోరారు. అయితే వసంతకు కాదు, తనకే టికెట్ ఇవ్వాలని బొమ్మసాని సుబ్బారావు డిమాండ్ చేస్తున్నారు. ఈ పంచాయితీ ఎంత వరకు వెళ్తుందో చూడాలి.